Mercedes Benz to Hike Prices in India:లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా కార్ల ధరలు పెంచేందుకు రెడీ అయింది. తన అన్ని మోడల్ కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2025 జనవరి1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణం, ఫ్యూయెల్ ధరల హెచ్చుతగ్గుల కారణంగా ధరలు పెంచక తప్పలేదని కంపెనీ తెలిపింది.
"ద్రవ్యోల్బణం, ఫ్యూయెల్ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యాపార కార్యకలాపాలపై భారీ ఒత్తిడి ఎదురవుతోంది. గత మూడు క్వార్టర్స్ నుంచి కంపెనీ నిర్వహణ వ్యయం పెరుగుతోంది. దీంతో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం." - సీఈవో సంతోష్ అయ్యర్, మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ
కంపెనీ తీసుకున్న నిర్ణయంతో మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ 31వ తేదీ లోపు ఈ కార్లను బుకింగ్ చేసుకున్న వారికి ఈ పెంపు ధరలు వర్తించవని కంపెనీ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం రూ.45 లక్షలు విలువైన ఏ-క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు అనేక రకాల వాహనాలను దేశీయంగా విక్రయిస్తోంది.