Laptop Buying Guide :ల్యాప్‌టాప్‌ల వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయింది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు తమ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా ల్యాప్‌టాప్‌లను కొని వినియోగిస్తున్నారు. వీరిలో ఒక్కొక్కరి అవసరం ఒక్కో రకంగా ఉంటుంది. ఇంతకీ విద్యార్థులు ఎలాంటి ల్యాప్‌టాప్ కొనాలి? దాన్ని కొనేటప్పుడు ఏయే స్పెసిఫికేషన్లను చెక్ చేయాలి? ఎంతవరకు ధర పెట్టాలి? అనే వివరాలతో కథనమిది.
కన్ఫ్యూజన్ వద్దు, ఈ ప్రశ్నలు వేసుకోండి
తొలిసారి ల్యాప్‌టాప్ కొనేందుకు స్టోర్‌కు వెళ్లేవారు చాలా గాబరా పడిపోతుంటారు. ల్యాప్‌టాప్‌కు సంబంధించిన ఏయే అంశాల గురించి స్టోర్ వాళ్లను అడిగి తెలుసుకోవాలో అర్థంకాక సతమతం అవుతుంటారు. ఈ అయోమయం ఉండకూడదు అనుకుంటే, స్టోర్‌కు వెళ్లడానికి ముందు మీకు మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. మీరు ల్యాప్‌టాప్ ఎందుకు కొందామని అనుకుంటున్నారు అనే మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలి. మీకు వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, వీడియో స్ట్రీమింగ్ వంటివి చాలా ? సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, గేమింగ్ వంటివి కావాలా ? అనే అంశాలపై క్లారిటీకి రావాలి. వీటి ఆధారంగానే స్టోర్ వాళ్లతో మాట్లాడండి.
మీ అవసరాలను తీర్చే కెపాసిటీ, ఫీచర్స్, ఆధునిక మెకానిజం కలిగిన ల్యాప్‌టాప్‌లు చూపించమని అడగండి. ఈక్రమంలో మీ బడ్జెట్ రేంజ్ గురించి కూడా వారికి స్పష్టంగా చెప్పండి. ల్యాప్‌టాప్ బరువు, కొలతలు కూడా ముఖ్యమైన అంశాలే అని గుర్తుంచుకోండి. ఎక్కువ బరువు, పెద్ద సైజు ఉండే ల్యాప్‌టాప్‌లను మీతో ఇతర చోట్లకు తీసుకెళ్లడం కష్టంతో కూడుకున్న వ్యవహారమని మీకు కూడా తెలుసు. మీ కంటిపై భారం పడని విధంగా స్క్రీన్‌పై ఉండే ఎలిమెంట్స్‌ను స్పష్టంగా చూపించే మీడియం లేదా అంతకంటే కొంచెం పెద్ద సైజు ల్యాప్‌టాప్‌ను తీసుకోవడం మంచిది.
ఆపరేటింగ్ సిస్టమ్ ఏది?
విద్యార్థులు తమ అకడమిక్ అవసరాలను తీర్చగలిగే ఫీచర్స్‌తో కూడిన ల్యాప్‌టాప్ కొనడానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఈక్రమంలో ల్యాప్‌టాప్‌లో ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ఉంటే బెటర్ అనేది ముందే తెలుసుకోవాలి. ఒక్కో ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కో రకమైన సౌలభ్యాలను అందిస్తుంది. ఒక్కో దాంట్లో ఒక్కో విధమైన అప్లికేషన్లు ఉంటాయి. సాధారణంగానైతే విండోస్ ల్యాప్‌టాప్‌లు విద్యార్థులకు బాగా సూట్ అవుతుంటాయి. వీటి అప్లికేషన్లు, సాఫ్ట్‌వేర్‌లు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. యాపిల్ ల్యాప్ టాప్స్ తీసుకునే వారికి macOS ఆపరేటింగ్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతో అనువుగా ఉంటుంది. ఇందులో చక్కటి క్లౌడ్-ఆధారిత అప్లికేషన్లు కూడా ఉంటాయి.
ప్రాసెసర్ ఎంపిక
విద్యార్థులు ల్యాప్‌టాప్ కొనేటప్పుడు ప్రాసెసర్ (సీపీయూ) సామర్థ్యం గురించి అడిగి తెలుసుకోవాలి. ల్యాప్‌టాప్ పనితీరు వేగవంతంగా ఉండాలంటే ప్రాసెసర్ స్పీడ్‌గా ఉండాలి. ఒక మంచి సీపీయూ మీ మల్టీ టాస్కింగ్ సాఫీగా జరిగేందుకు, వేగంగా లోడింగ్ ప్రక్రియ పూర్తయ్యేందుకు దోహదం చేస్తుంది. విభిన్న రకాల సాఫ్ట్‌వేర్లను నిర్వహించే సామర్థ్యం దానికి ఉంటుంది. ఇంటెల్ కోర్ కంపెనీకి చెందిన 11వ తరం లేదా 12వ తరం ప్రాసెసర్లు ఇప్పుడు నడుస్తున్నాయి. ఇంటెల్ కోర్ i5 చాలా మంది విద్యార్థులకు సరిపోతుంది. ఇంటెల్ కోర్ i7 కూడా బాగుంటుంది. ఏఎండీ రైజెన్ కంపెనీ ప్రాసెసర్లు కూడా లభిస్తాయి.