Sex And Pregnancy In Space : అంతరిక్షం - మనిషికి ఎంతో ఆసక్తి కలిగిన అంశం. దానిపై ఇప్పుడు ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. భారత దేశం కూడా గగన్‌యాన్ మిషన్‌పై దృష్టి పెట్టింది. భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. అంతరిక్షంలోని గ్రహాలపై భారత్ సహా ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అంగారక గ్రహం(మార్స్) భూమిని తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మానవాళి పరిశోధనలకు మైదానంగా మారిన అంతరిక్షంపై మనిషి మెదడులో చాలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అక్కడ వ్యోమగాముల మధ్య లైంగిక సంపర్కం సాధ్యమా? మహిళలకు గర్భధారణ జరుగుతుందా? అంతరిక్షంలో పుట్టే శిశువులు ఎలా ఉంటారు? అనే వాటికి సమాధానం తెలుసుకోవాలనే కుతూహలం చాలా మందికి ఉంటుంది. ఆ వివరాలను చూద్దాం.
అంతరిక్షంలో ప్రెగ్నెన్సీ సాధ్యమా?
మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో గర్భం దాల్చడం సాధ్యమా? అంటే - చాలా వరకు సాధ్యమే. అయితే అంతరిక్షంలోని విభిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్ల గర్భం దాల్చిన మహిళకు, ఆమె కడుపులోని పిండానికి ముప్పు పొంచి ఉంటుంది. గురుత్వాకర్షణ లేకపోవడం, భారీ రేడియేషన్ వల్ల కడుపులోని పిండం ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కనుక ఆరోగ్యపరమైన సవాళ్లను ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అంతరిక్ష యాత్రలో ఉండే వ్యోమగాములు సెక్స్‌లో పాల్గొనే అంశంపై ప్రస్తుతానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు ఒక నిర్దిష్ట విధానమేదీ లేదు. ఇప్పటి వరకు అంతరిక్ష యాత్రల్లో నాసా వ్యోమగాములు ఎవరూ ఆ పని చేయలేదు!
ఎముకల సాంద్రత తగ్గి ఇబ్బందులు!
అంతరిక్షంలో పుట్టే శిశువులకు పుట్టుకతోనే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. గురుత్వాకర్షణ లోపించడం వల్ల, అంతరిక్షంలో పుట్టే శిశువుల ఎముకల సాంద్రత తగ్గుతుంది. అంతరిక్ష వాతావరణంలో ఆరు నెలల పాటు గడిపితే వ్యోమగాముల ఎముకల సాంద్రత సగటున 12 శాతం మేర క్షీణించిపోతుంది. ఈ లెక్కన అంతరిక్షంలో జన్మించే సమయానికి శిశువు ఎముకల సాంద్రత గణనీయంగా తగ్గిపోతుంది. పెల్విక్ ఎముకలు బాగా బలహీనపడతాయి. తల్లికి ప్రసవం చేసే సమయంలో, శిశువు ఎముకలు విరిగే ముప్పు ఉంటుంది. అంతరిక్ష రేడియేషన్ ప్రభావం వల్ల మహిళా వ్యోమగామి కడుపులోని పిండంలో జన్యుపరమైన బలహీనతలు ఏర్పడతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.
ఎలుకల వీర్యం ఆరేళ్లు అక్కడే
అంతరిక్షంలో జంతువుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి? అనే దానిపై గతంలో శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా గడ్డకట్టిన దశలో ఉన్న ఎలుకల వీర్యాన్ని అంతరిక్షానికి పంపారు. దాన్ని అక్కడ ఆరేళ్ల పాటు ఉంచారు. అనంతరం భూమికి తీసుకొచ్చి, ఆ వీర్యం ద్వారా ఎలుక పిల్లలు జన్మించేలా చేశారు. ఇలా జన్మించిన వాటిలో 168 ఆరోగ్యవంతమైన ఎలుకలు ఉన్నాయి. వాటిపై రేడియేషన్ ప్రభావం పడలేదని వెల్లడైంది. అయితే మనుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా స్పందిస్తుందనే దానిపై శాస్త్రీయ ఆధారాలేం లేవు.