Sunita Williams Birthday: మూడోసారి రోదరిలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందినవారు. 8 రోజులపాటు మిషన్‌లో భాగంగా తన తోటి వోమగామి విల్మోర్తో కలిసి ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)కు వెళ్లిన ఆమె గత కొన్ని రోజులుగా స్పేస్‌లో చిక్కుకున్నారు. సెప్టెంబర్ 19న ఆమె పుట్టినరోజు కాగా.. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతరిక్ష కేంద్రంలోనే బర్త్ డే వేడుకలు నిర్వహించుకున్నారు.
బర్త్ డే ఎలా జరుపుకొన్నారంటే?: చాలా మంది తమ పుట్టిన రోజు వేడుకలను కేక్, కొవ్వొత్తులతో జరుపుకొంటారు. అయితే సునీతా విలియమ్స్ మాత్రం తన 59వ బర్త్ డే ఐఎస్ఎస్లోని ట్రాంక్విలిటీ మాడ్యూల్‌లోని వ్యర్థాలు, పరిశుభ్రత కంపార్ట్‌మెంట్ ఫిల్టర్‌లను భర్తీ చేయడం ద్వారా జరుపుకొన్నారు. సాధారణ భాషలో దీనిని బాత్రూమ్ ఆఫ్ స్పేస్‌గా పిలుస్తారు. సెప్టెంబర్ 19న ఆమె బిజీ షెడ్యూల్‌తో కొన్ని ముఖ్యమైన పనులతో గడిపారు. తన తోటి నాసా వ్యోమగామి విల్మోర్తో కలిసి స్పేస్ స్టేషన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లను నిర్వహించడంపై కూడా ఆమె దృష్టి సారించారు.
నిర్వహణ పనులతో పాటు విలియమ్స్ వ్యోమగాములు బారీ విల్మోర్, ఫ్రాంక్ రూబియోలతో కలిసి హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో ఫ్లైట్ డైరెక్టర్‌లతో ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చల్లో భాగంగా వ్యోమగాముల లక్ష్యాలు, చేయాల్సిన పనులు, వివిధ శాస్త్రీయ అధ్యయనాల గురించి మాట్లాడారు. కాగా స్పేస్‌లో బర్త్‌డే చేసుకోవడం ఆమెకు ఇది రెండోసారి. గతంలో 2012లోనూ విలియమ్స్ తన పుట్టినరోజున మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌లోనే ఉన్నారు.