How to Make Vamaku Pachadi : చలికాలంలో.. జలుబు, దగ్గు, జ్వరం, కఫం వంటివి సాధారణం. అయితే.. వీటిన్నంటి నుంచి వామాకు రక్షిస్తుంది. ఈ ఆకుల వాసన పీలిస్తే జలుబు తగ్గిపోతుందని.. అలాగే కఫంతో బాధపడుతున్న వారు.. గ్లాసుడు నీళ్లలో రెండు వామాకులను మరిగించి వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. వామాకులను 'మదర్ ఆఫ్ హెర్బ్స్ అనీ, ఇండియన్ థైమ్' అని కూడా అంటుంటారు. ఆకుపచ్చ రంగులో దళసరిగా చూడచక్కగా ఉండే ఈ వామాకుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. ఇక చాలా మంది వామాకులతో కూరలు, రసం, బజ్జీలు వంటివి చేస్తుంటారు. అలాగే కొంతమంది వామాకులతో రైస్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు. అయితే.. కేవలం ఇవి మాత్రమే కాదు వామాకుతో అద్భుతమైన పచ్చడి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో వేడి వేడి అన్నంలో తింటుంటే కలిగే మజానే వేరు. మరి ఈ సూపర్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..
కావాల్సిన పదార్థాలు:
- వామాకులు - 25
- నువ్వులు - 1 టేబుల్ స్పూన్
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- పల్లీలు - 1 టీ స్పూన్
- పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్
- మినపప్పు - 1 టీ స్పూన్
- ధనియాలు - 1 టీ స్పూన్
- ఎండు మిర్చి - 10
- చింతపండు - నిమ్మకాయ సైజంతా
- పసుపు - చిటికెడు
- జీలకర్ర - అర టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 5
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం:
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీ స్పూన్
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 3
- జీలకర్ర - అర టీ స్పూన్
- పచ్చి శనగపప్పు - అర టీ స్పూన్
- మినపప్పు - అర టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువు - చిటికెడు
- ఎండు మిర్చి - 2
తయారీ విధానం:
- ముందుగా వామాకులను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఓ క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి.
- ఈ లోపు.. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు అదే పాన్లో నూనె పోసి పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు వేసి వాటిని ఫ్రే చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు వేసి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఎండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ ఎండు మిరపకాయలను మీరు తీసుకున్న వామాకులు, మీరు తినే కారాన్ని బట్టి ఎంచుకోవాలి. ఎండు మిర్చి వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని నువ్వులు వేసిన ప్లేట్లోకి తీసుకువాలి.
- ఇప్పుడు అదే పాన్లో శుభ్రం చేసిన వామాకులు, చింతపండు, పసుపు వేసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆకులను మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ అందులోని నీరు ఆవిరి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- ఇప్పుడు మిక్సీజార్ తీసుకుని వేయించిన నువ్వులు, పల్లీల మిశ్రమం, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఉడికించిన వామాకులను వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు ఈ పచ్చడి కోసం తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి.
- ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, దంచిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత పచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- అనంతరం ఎండు మిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చివరకు ఇంగువ వేసి కలిపి ఈ తాలింపును పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యానందించే వామాకు పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.
జొన్నలతో రొట్టెలు, దోశలే కాదు - ఇలా "ఉప్మా"ను ప్రిపేర్ చేసుకోండి! - ఆరోగ్యానికి ఎంతో మేలు!