Daku Maharaj Success Meet : నందమూరి నట సింహం బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన 'డాకు మహారాజ్' మూవీ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో మెగా సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇందులో బాలయ్యతో పాటు, శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యాజైస్వాల్, డైరెక్టర్ బాబీ,మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటి ఊర్వశి రౌతేలా పాల్గొని సందడి చేశారు. ఇక బాలకృష్ణ 'గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ' అంటూ పాటతో, డైరెక్టర్ బాబీ కూడా ఈల పాటతో అలరించారు.
ఆ తర్వాత బాలయ్య తన పవర్ఫుల్ స్పీచ్‌తో స్టేజ్ దద్దరిల్లిపోయేలా చేశారు. ఈ సినిమా నా అభిమానులకే కాకుండా, పరిశ్రమకి కూడా ఈ ఎంతో తృప్తినిచ్చిందని అన్నారు. డైరెక్టర్ నా నుంచి నవరసాల్ని రాబట్టుకున్నారని కొనియాడారు. ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు.
"దేశానికి ఒక రాష్ట్రపతిని ఇచ్చింది ఈ రాయలసీమ. అవిభక్త ఆంధ్ర రాష్ట్రానికి ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇచ్చిందీ రాయలసీమే. తెలుగు జాతి కోసం పిడికిలి బిగించిన ఒక మహనీయుడ్ని గుండెల్లో పెట్టుకుంది కూడా రాయలసీమ. వరల్డ్ మ్యాప్‌లో ఆంధ్ర రాష్ట్రాన్ని విజనరీ చేసిందీ రాయలసీమ. ఈ గడ్డపైన ఈ వేడుకను చేసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 'డాకు మహారాజ్'ని ఇంతటి సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని పొందడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సమాజంపై నాకు ఎంతో బాధ్యత ఉంది. నా అభిమానులను కాలర్ ఎగరేసి గర్వపడేలా చూసుకునే బాధ్యత కూడా నాపై ఉంది. ఎన్టీఆర్ నాకు ఓ పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారు. ఆయన బిడ్డగా పుట్టడం నా జన్మజన్మల పుణ్యఫలం. నాకు ఇది వరసగా నాలుగో విజయం. అయితే నా సినిమాల వసూళ్ల గురించి నేను అంతగా పట్టించుకోను. అభిమానులకే నా రికార్డులు తెలుసు. అంతేకాకుండా నా అవార్డులు, రివార్డులన్నీ నిజమైనవే అని కూడా వాళ్లకు తెలుసు." అని బాలయ్య అన్నారు.
'డాకు మహారాజ్' కాసుల వర్షం- 8 రోజుల్లోనే రూ.150 కోట్లు వసూల్!
'డాకు' సక్సెస్ సెలబ్రేషన్స్- ఊర్వశీతో బాలయ్య క్రేజీ డ్యాన్స్!