Beware Of APK File Cyber Scams : టెక్నాలజీ రోజురోజుకు ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరిట, ఆయా స్కీముల లబ్ధిదారుల జాబితా పేరిట సైబర్ మోసగాళ్లు అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఆన్లైన్ వేదికగా కాచుకొని ఉంటున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపించే లింక్‌లను, ఏపీకే ఫైల్స్‌ను పొరపాటునా క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది.
ఏపీకే ఫైల్స్, లింకులతో వల వేస్తున్న సైబర్ నేరగాళ్లు : నిజామాబాద్ జిల్లా బీబీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇటీవల వాట్సప్ గ్రూపులో ‘పీఎం కిసాన్ యోజన పేరుతో ఓ ఏపీకే ఫైల్ వచ్చింది. తనకు పీఎం కిసాన్ పథకం డబ్బులు పడ్డాయో లేదోననే ఉత్సాహంలో అతడు ఆ ఫైల్‌ను క్లిక్ చేశాడు. వెంటనే స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయి పనిచేయలేదు. అతడికి తెలియకుండానే తన పేరిట పలు వాట్సప్ గ్రూపుల్లోకి అదే ఏపీకే ఫైల్ వెళ్లింది. చివరికి అతడికి తెలిసిన వ్యక్తులు ఫోన్ చేసి ఎందుకు తమ వాట్సాప్‌నకు ఫైల్ పంపావని అడిగారు. దీంతో అవాక్కయిన బాధితుడు తాను ఎలాంటి ఫైల్ పంపలేదని అందరికీ మెసేజ్ చేశాడు. వాట్సప్ గ్రూపులో వచ్చిన ఏపీకే ఫైల్‌ను ఓపెన్ చేసినటువంటి ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాను సైబర్ మోసగాళ్లు ఖాళీ చేశారు. దీంతో అప్రమత్తమైన అతడు మిగతా వారిని అప్రమత్తం చేశాడు.
అప్రమత్తతతోనే గట్టెక్కవచ్చు : వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో పోస్టు చేసే లింక్‌లు, ఫైల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీటిని తెలియక ప్రజలు క్లిక్ చేస్తే ఫోన్‌లోని అప్లికేషన్లు, వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తిపోయే ప్రమాదముంది. ఇంటర్‌నెట్ సాయంతో ఫోన్‌ని తమ అధీనంలోకి తీసుకుంటున్న నేరగాళ్లు బ్యాంకు వివరాలు తెలుసుకొని ఓటీపీ సహాయంతో ఖాతాల్లోని నగదును స్వాహా చేస్తున్నారు. బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చేంత వరకు బాధితుడికి మోసపోయిన విషయం తెలియడం లేదు.
ఏం చేయాలంటే? : తమ స్మార్ట్ ఫోన్ ఫోన్ హ్యాక్ అయిందని, తాము మోసపోయామని గుర్తించిన బాధితులు ఎంత త్వరగా స్పందిస్తే అంత మేలు. డయల్ 100కు లేదా 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వివరంగా తెలపాలి. వెంటనే సైబర్ క్రైం విభాగ పోలీసులు అప్రమత్తమై బాధితుడి బ్యాంకు అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం లేదా ఎటువంటి లావాదేవీలు జరగకుండా చూస్తారు. దీంతో కొంతమేరకైనా నష్టపోకుండా జాగ్రత్తపడవచ్చు. చోరీకి గురైన నగదును రాబట్టే అవకాశం ఉంది.
ఈ-మెయిల్‌లో ఒకే ఒక్క అక్షరం మార్చి - 'మేఘా'కు రూ.5.47 కోట్లు టోకరా
వామ్మో ఎంత తెలివి! - ఇంత పకడ్బందీగా, పద్దతిగా కూడా డబ్బులు కొట్టేస్తారా?