America Immigration Detention Bill : ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ వలసదారుల బహిష్కరణకు సంబంధించిన కీలక బిల్లుకు తాజాగా యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దొంగతనాలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకునేలా ఈ బిల్లులో నిబంధనలు రూపొందించారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత ముఖ్యమైన ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బిల్లు ఇదేనని అలబామా రిపబ్లికన్ సెనేటర్ కేటీ బ్రిట్ అన్నారు. అయితే, ఈ బిల్లును అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న నిధులు సరిపోవని ఫెడరల్ అధికారులు హెచ్చరించారు. దీంతో ఈ ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమలుకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
శరణార్థ శిబిరాలు ఏర్పాటు చేస్తున్న మెక్సికో
అక్రమ వలసదారులను బయటకు పంపుతాననే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెక్సికో అప్రమత్తం అయింది. సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అమెరికా రాష్ట్రం టెక్సాస్‌లోని ఎల్ పాసో సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున శిబిరాలను నిర్మిస్తోంది. బహిష్కరణకు గురైన వారి కోసం ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలు ప్రారంభ దశ మాత్రమేనని మెక్సికోలోని ఓ అధికారి వెల్లడించారు. వలసదారుల సంఖ్య ఆధారంగా మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చి అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వారిని, మెక్సికన్ నగరానికి పంపించాలని సూచించారు.
1500 క్రియాశీలక బలగాలను మోహరింపు
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నిఘాను పెంచడం కోసం 1500 క్రియాశీలక బలగాలను మోహరిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఇప్పటికే 5వేల మందికి పైగా వలసదారులను నిర్బంధించినట్లు, వారిని దేశం నుంచి పంపించే విషయంలో హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు తాము మద్దతుగా ఉంటామని వెల్లడించింది. అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం తాము సైనిక విమానాలను పంపిస్తామని తాత్కాలిక రక్షణ కార్యదర్శి రాబర్ట్ సాలెస్సెస్ పేర్కొన్నారు.