Champions Trophy 2025 Venue Schedule : పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. అయితే, భద్రత సహా ఇతర కారణాలు దృష్ట్యా బీసీసీఐ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ మోడల్‌లోనే ఆడతామని చెప్పింది. ఈ ప్రతిపాదనను అంగీకరించాలని పీసీబీకి ఇప్పటికే ఐసీసీ కూడా ఆఫర్ ఇచ్చింది. కానీ దీనికి ససేమీరా అంటూ పీసీబీ మొండిపట్టు పట్టుకుని ఉంది. తమ దేశానికి టీమ్ ఇండియా రావాలంటూ పట్టుబట్టి కూర్చుంది.
అయితే ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఛాంపియన్స్ ట్రోఫీ సుజావుగా సాగేలా, నవంబరు 29న అధికారిక షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. ఈ టోర్నీని పూర్తిగా పాకిస్థాన్ వెలుపలే నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.
వాస్తవానికి ఆ మధ్య కూడా ఇదే వార్తలు చక్కర్లు కొట్టాయి. పీసీబీ హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకోకపోతే పాక్ వెలుపలే టోర్నీని నిర్వహిస్తారని ప్రచారం సాగింది. ఇందుకు భారత్ కూడా ఓ కారణమని కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్ దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల టోర్నీని బయట నిర్వహించాలని అనుకుంటున్నారట.
అసలేం జరిగిందంటే? - గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్థాన్‌లో తీవ్రంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న సిరీస్ నుంచి లంక జట్టు మధ్యలోనే నిష్క్రమించింది. రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడటం కోసం లంక-ఎ జట్టు పాకిస్థాన్‌కు వెళ్లింది. కానీ ఈ ఆందోళనల మధ్య రెండు వన్డేలు మిగిలి ఉండగానే, సిరీస్‌ను మధ్యలోనే వదిలేసి స్వదేశానికి వెళ్లిపోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ పరిణామాల్నీ పాకిస్థాన్‌కు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. పైగా బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీని నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఐసీసీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. అందుకే ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏదేమైనా ఈ నెల 29న వర్చువల్‌గా నిర్వహించే భేటీలో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై ఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది.
రూ.2.2 కోట్ల CSK బౌలర్‌పై చెలరేగిన హార్దిక్ - ఒకే ఓవర్‌లో ఏకంగా ఎన్ని పరుగులంటే?