Bangladesh Army chief on Political Issues : ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలోనే హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులు, విధ్వంస కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పక్షాలను ఉద్దేశించి దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు తమలో తాము పోట్లాడుకోవద్దని, ఈ అంతర్గత పోరు వల్ల దేశ సార్వభౌమత్వానికి పెనుముప్పు కలిగిస్తుందని హెచ్చరించారు. దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, నేరస్థులు దీన్ని అనుకూలంగా మలచుకుంటున్నారని ఓ కార్యక్రమంలో వెల్లడించారు.
'దేశంలో శాంతిభద్రతల క్షీణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనమంతా గొడవల్లో నిమగ్నమై ఉండటమే మొదటి కారణం. మనలో మనమే పోట్లాడుతుకుంటున్నాం. విభేదాలను పక్కనపెట్టకుండా, అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఘర్షణలకు దిగడం వల్ల దేశ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం ప్రమాదంలో పడుతుంది. ఇటువంటి పరిస్థితులను దుండగులు తమకు అనుకూలంగా మలచుకుంటుకున్నారు. గందరగోళం సృష్టించే బదులు, బంగ్లాదేశీయులంతా ఐక్యంగా ఉంటూ దేశాన్ని కాపాడుకోవడం ముఖ్యం. నేను మళ్లీ హెచ్చరిస్తున్నా. అప్పుడే ఎందుకు అప్రమత్తం చేయలేదంటూ భవిష్యత్తులో నన్ను అనొద్దు' అని ఓ కార్యక్రమంలో వకార్ అన్నారు.
తనకు ఎటువంటి వ్యక్తిగత ఆశయాలు అంటూ ఏమి లేవని ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ పేర్కొన్నారు. దేశాన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావాలనుకుంటున్నానని, ఆపై విశ్రాంతి తీసుకుంటానని తెలిపారు. సైన్యం సైతం తమ బ్యారక్‌లకు వెళ్లిపోతుందన్నారు. దేశంలో ఎన్నికల నిర్వహణకు 18 నెలలు పడుతుందని గతంలో చెప్పానని, ప్రస్తుతం ఇదే మార్గంలో ఉన్నామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో గతేడాది ఆగస్టు 5న దేశం వీడిన షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులను, చట్ట ఉల్లంఘనలకు పాల్పడేవారే లక్ష్యంగా యూనస్ సర్కారు 'ఆపరేషన్ డెవిల్ హంట్'ను చేపట్టింది.