K4 Ballistic Missile:భారత నౌకాదళం అణ్వాయుధ సామర్థ్యం గల 'K-4 బాలిస్టిక్ క్షిపణి'ని విజయవంతంగా పరీక్షించింది. ఈ మిస్సైల్‌ను కొత్తగా ఇండియన్ నావీలో చేరిన న్యూక్లియర్ సబ్‌మరైన్ INS అరిఘాట్ నుంచి గురువారం ప్రయోగించారు. ఈ క్షిపణి 3,500 కిలోమీటర్ల రేంజ్‌ను ఈజీగా టార్గెట్ చేసిందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రయోగం దేశ రక్షణ సామర్థ్యాలలో ఓ మైలు రాయి అని చెప్పొచ్చు. ఇందులో భారత్ అణునిరోధక శక్తిని పెంచే సామర్థ్యం కూడా ఉంది. ఈ క్షిపణి టెస్టింగ్‌కు ముందు నీటి అడుగున ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కూడా క్షిపణి ప్రయోగ ట్రయల్స్‌ను DRDO నిర్వహించిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఒక దేశంపై సెకండ్ అటాక్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. అంటే శత్రు దేశాలు మనపై అటాక్ చేసిన సందర్భాల్లో మనం భూమిపై తిరిగి అటాక్ చేసేందుకు పరిస్థితి సహకరించకపోతే, సబ్‌మెరైన్ నీటి అడుగు నుంచి దీని సహాయంతో ప్రతిదాడి చేయొచ్చు.
భారత్ నో ఫస్ట్-యూజ్ న్యూక్లియర్ పాలసీకి కట్టుబడి ఉంది. అయితే ఒకవేళ శత్రువులు ముందుగా దాడి చేస్తే మాత్రం వారికి ధీటుగా సమాధానం ఇచ్చేందుకు ఇటువంటి క్షిపణులను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలోనే భారత్రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇండియన్ నావీ మిస్సైల్ సిస్టమ్‌ను మరింత బలపరిచేందుకు K4 బాలిస్టిక్ క్షిపణి వంటి ప్రయోగాలు చేపడుతోంది.