Indiramma House Application : ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న కొంత మందికి నిరాశే ఎదురైంది. వాస్తవానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ జాబితాలో చోటు దక్కాల్సి ఉండగా, ఆన్‌లైన్‌లో నమోదు సందర్భంగా జరిగిన తప్పిదాలతో పలువురి పేర్లు రావట్లేదు. కంప్యూటర్ ఆపరేటర్ తప్పులు చేయడం వల్లే ఇలా జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా ఒక ఊరిలో నివాసముంటే, ఇంకోఊరిలో సర్వే జాబితాలో పేర్లు వచ్చాయి. దీంతో దరఖాస్తుదారులు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. పేర్లు రాని వారి వివరాలు మళ్లీ నమోదు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పేర్లు రాని వారికి అవకాశం కల్పించాలి : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 1,48,780 మంది వివరాలు సర్వే జాబితాలో ఉండగా, పలువురి పేర్లు గల్లంతు కావడంతో ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు సందర్భంగా జరిగిన పొరపాట్లకు దరఖాస్తుదారుల్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఇలాంటి వారి వివరాలను మళ్లీ సేకరించి, పరిగణనలోకి తీసుకొని సర్వే చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ధన్వాడ ఎంపీడీవో సాయి ప్రకాశ్‌ను వివరణ అడగగా పేర్లు గల్లంతు అయిన వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం లేదన్నారు. ఈ విషయాల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వారి ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామన్నారు.
ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు : నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు క్రమ సంఖ్యగా డీఎన్‌డబ్ల్యుడీ 3బీ52గా వచ్చింది. దీంట్లో ఇందిరమ్మ పథకం ఇల్లు కోసం టిక్ చేయగా, తీరా చూస్తే సర్వే జాబితాలో పేరు రాలేదు. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా సంబంధిత దరఖాస్తులో ఇల్లు కోసం మార్క్ కొట్టి ఉండకపోవచ్చని సమాధానం ఇచ్చారు. అధికారులకు రశీదు చూపగా, సమాధానం చెప్పటం లేదు. ఇలాంటి సమస్యలు ధన్వాడ మండలంలో ఒక్కటే కాదు జిల్లా వ్యాప్తంగా చాలానే ఉన్నాయి.
'మా పేరు ఎందుకు రాలేదు సార్'? - ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో కనిపించని అర్హుల పేర్లు!
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అనేక చిక్కుముళ్లు! - ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు?!!