Ramgopalpet Police Notice To Allu Arjun : హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ లేకపోవడంతో ఆయన మేనేజర్ కరుణాకర్‌కు అందజేశారు. ఆసుపత్రికి ఎప్పుడొచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. గంట లోపు ఈ ప్రక్రియ అంత పూర్తయ్యేగా చూసుకోవాలని, సందర్శన అంతా గోప్యంగా ఉంచాలని పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని ఇందుకు సహకరించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించకుండా అకస్మాత్తుగా సందర్శనకు వస్తే జరిగే పరిణామాలకు బాధ్యత వహించాలని తెలిపిన పోలీసులు రాంగోపాల్ పేట్ నోటీసుల్లో తెలిపారు.
ఆసుపత్రికి రావొద్దు : మరోవైపు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజను అల్లు అర్జున్ పరామర్శించడానికి వెళ్లాలనుకున్న నేపథ్యంలో రాంగోపాల్‌పేట పోలీసులు ఆదివారం నోటీసులు ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రికి రావద్దంటూ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఆసుపత్రికి వస్తే మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుందని వివరించారు. ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు ఆయన ఆసుపత్రికి వెళ్లలేదు.
నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించిన అల్లు అర్జున్
పీఎస్‌లో సంతకం : పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల్లో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పీఎస్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాలని ఆదేశించింది. దీంతో ఆయన ఆదివారం ఠాణాకు చేరుకుని ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సంతకం చేసి వెళ్లిపోయారు.