Naxalites Blow Up Security Personnel Vehicle : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చేశారు. ఈ ఘటనలో 8 మంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్-డీఆర్జీ సిబ్బందితోపాటు ఓ డ్రైవర్ మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ తెలిపారు. మరో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో వాహనంలో 15 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
VIDEO | Bijapur naxal attack: Visuals from the spot where eight jawans of DRG and a civilian driver were killed after Naxals blew up their vehicle with an improvised explosive device earlier today.
— Press Trust of India (@PTI_News) January 6, 2025
(Source: Third Party) pic.twitter.com/LpK05fqBDA
దాడికి గురైన బస్సులోని సిబ్బంది దంతెవాడ, నారాయణ్‌పుర్, బీజాపుర్‌లో యాంటీ నక్సలైట్ అపరేషన్ పూర్తి చేసుకుని బేస్ క్యాంప్‌నకు తిరుగుప్రయాణమయ్యారు. భద్రతా బలగాల కాన్వాయ్ బీజాపుర్‌లోని కుట్రూ హరదారిపై వెళుతున్న క్రమంలో అంబేలీ గ్రామం వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చేశారు. భారీ పేలుడు ధాటికి కాన్వాయ్‌లోని ఓ వాహనం చెల్లాచెదురుగా పడిపోయింది. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. పేలుడు జరిగిన ప్రాంతంలో పెద్ద గుంత ఏర్పడింది.
దీనిపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యల కోసం ఘటనాస్థలికి రీఇన్ఫోర్స్మెంట్ టీమ్స్‌ను పంపించినట్లు ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, గత రెండేళ్లలో భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని ఓ అధికారి వెల్లడించారు.
'జవాన్ల బలిదానం వృథా కాదు'
మావోయిస్టుల చేసిన ఈ దాడిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ స్పందించారు. "బీజాపుర్‌లో నక్సలైట్లు జరిపిన దాడిలో 8 మంది జవాన్లు వీరమరణ పొందారనే వార్త చాలా బాధాకరం. అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. బస్తర్‌లో జరుగుతున్న నక్సల్స్ నిర్మూలన చర్యలపై నక్సలైట్లు విసుగు చెందుతున్నారు. అందుకే ఈ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. జవాన్ల బలిదానం వృథా కాదు, నక్సలిజాన్ని అంతం చేసేందుకు మా పోరాటం బలంగా కొనసాగుతుంది" అని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
'నక్సలిజం అంతం తథ్యం'
నక్సలైట్ల దాడిలో జవాన్లు మరణించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. "మన జవాన్ల త్యాగాలను వృథా కానివ్వం. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలిజం లేకుండా చేస్తాం" అని స్పష్టం చేశారు.
![Naxalites Blow Up Security Personnel Vehicle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-01-2025/23266798_nax1-1.jpeg)
ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారం?
శనివారం అర్థరాత్రి ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా ఓ డీఆర్జీ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా భద్రతా దళాలు మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు జవాన్ల కాన్వాయ్‌పై దాడి చేశారు.
2023 ఏప్రిల్ 26న దంతెవాడ జిల్లాలో భద్రతా సిబ్బందిని తీసుకువెళుతున్న కాన్వాయ్‌పై నక్సలైట్లు ఇలాగే దాడి చేశారు. ఆ ఘటనలో 10మంది పోలీసులు సిబ్బంది సహా ఓ డ్రైవర్ మృతిచెందాడు.