Cowpea Seeds Germinate in Space: స్పేడెక్స్ ప్రయోగ విజయంతో 2024కు ఘనమైన ముగింపు పలికిన ఇస్రో మరో అద్భుతం సృష్టించింది. ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు (బొబ్బర్లు) అక్కడే మొలకెత్తాయి. వ్యోమనౌక దూసుకెళ్లిన నాలుగు రోజుల్లోనే జీరో గ్రావిటీలో జరిగిన ఈ పరిణామం సైన్స్ ప్రపంచంలో ఉత్సుకతను రేకెత్తించింది.
స్పెడెక్స్ మిషన్‌లో భాగంగా అతరిక్షంలోకి పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (CROPS) అనే పేలోడ్‌లో ప్రత్యేక పరిస్థితుల్లో అలసంద విత్తనాలను పంపించారు. ఈ పేలోడ్‌ను ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం అంతరిక్షంలోని వివిధ వాతావరణాలలో మొక్కలు ఎలా పెరుగుతాయో తెలుసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. జీరో గ్రావిటీలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఆస్ట్రోనాట్స్ తమ ఆహారాన్ని రోదసిలోనే సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో లాంగ్- టెర్మ్ స్పేస్ ప్రాజెక్ట్‌ల కోసం దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం.
Life sprouts in space! 🌱 VSSC's CROPS (Compact Research Module for Orbital Plant Studies) experiment onboard PSLV-C60 POEM-4 successfully sprouted cowpea seeds in 4 days. Leaves expected soon. #ISRO #BiologyInSpace pic.twitter.com/QG7LU7LcRR
— ISRO (@isro) January 4, 2025
రోదసిలో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియకు ఉద్దేశించిన స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (స్పేడెక్స్) కోసం గత నెల 30న PSLV-C60 రాకెట్ ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. ఆ రాకెట్‌లోని నాలుగో దశ (POEM-4)ను ఉపయోగించుకొని 24 పేలోడ్‌లను కక్ష్యలోకి పంపింది. ఇందులో కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్ (CROPS) అనే ఇన్స్ట్రుమెంట్ కూడా ఉంది. ఇందులో 8 అలసంద విత్తనాలను పంపించగా అవి సూక్ష్మ గురుత్వాకర్షణలో నాలుగు రోజుల్లోనే మొలకెత్తాయి. దీనిపై ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. 'అంతరిక్షంలో జీవం మొలకెత్తింది.. త్వరలోనే ఆకులు వస్తాయని ఆశిస్తున్నాం' అంటూ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది.
అంతరిక్షంలో మొక్కలను పెంచడంలో, వాటి స్థిరమైన మనుగడలో ISRO సామర్థ్యాన్ని పెంచేందుకు CROPSను మల్టీ-స్టేజ్ ల్యాబ్‌గా రూపొందించారు. దీన్ని బోర్డ్‌లో ఫుల్లీ ఆటోమేటిక్ సిస్టమ్‌గా డిజైన్ చేశారు. జీరో గ్రావిటీ వాతావరణంలో 5 నుంచి 7 రోజుల పాటు విత్తనాన్ని మొలకెత్తించి, రెండు ఆకుల దశకు వచ్చే వరకు సరైన పోషకాహారం అందించాలని ఇస్రో యోచిస్తోంది.
ప్రయోగంలో కీలక విషయాలు:
- అంతరిక్షంలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం
- భవిష్యత్ లాంగ్-టెర్మ్ స్పేస్ మిషన్లకు సహాయం చేయడం
- అంతరిక్షంలో శాస్త్రవేత్తలకు పౌష్టికాహారం సిద్ధం చేయడం
- జీరో గ్రావిటీలో మొక్కల పెరుగుదలపై పరిశోధన
- గగన్‌యాన్, స్పేస్ స్టేషన్ వంటి భవిష్యత్తులో ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణంలో ఇస్రో కీలక పాత్ర పోషించడం
స్పేస్‌క్రాఫ్ట్ లోపల ఈ అలసంద విత్తనాలను యాక్టివ్ టెంపరేచర్ కంట్రోల్‌తో క్లోజ్డ్ బాక్స్ వాతావరణంలో ఉంచారు. ఇందులో కెమెరా ఇమేజింగ్, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ కాన్సంట్రేట్స్, సాపేక్ష ఆర్ద్రత (RH), ఉష్ణోగ్రత, నేల తేమ వంటి మొక్కల పెరుగుదల, దాని పర్యవేక్షణ కోసం తగిన వ్యవస్థ ఉందని ఇస్రో తెలిపింది.
SPADEX chaser captures an in-orbit space selfie video!
— ISRO (@isro) January 4, 2025
#ISRO #SpaceTech pic.twitter.com/5oCdmRLtTi
ISRO స్పేస్ డాకింగ్ ప్రయోగం: అలాగే తన స్పేస్ డాకింగ్ ప్రయోగంలో భాగంగా ISRO సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'లో ఛేజర్ ఉపగ్రహం భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. ఈ ఉపగ్రహం మార్స్‌పై లక్ష్య ఉపగ్రహంతో డాకింగ్ ప్రక్రియ నిర్వహిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది విజయవంతమైతే ప్రపంచంలోనే ఇంత అధునాతన టెక్నాలజీని కలిగి ఉన్న నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే ఈ టెక్నాలజీని కలిగి ఉన్నాయి.
సూర్యుని చెంతకు మానవ అస్త్రం- చరిత్ర సృష్టించిన 'పార్కర్ సోలార్ ప్రోబ్'
'విశ్వంలో డార్క్ ఎనర్జీ అనేదే లేదు- ఆ సిద్ధాంతాలు తప్పు'- వీడిన అతిపెద్ద మిస్టరీ!
తిప్పరా మీసం.. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు సర్వం సిద్ధం!