Delhi CEO Viral Screenshot:ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కోసం అభ్యర్థులు ఎంతగానో శ్రమిస్తారు. జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే చాలు ఆకర్షణీయంగా సీవీలు రూపొందించేందుకు సిద్ధమైపోతారు. ఒకప్పుడు సీవీ రూపొందించాలంటే తీవ్రంగా శ్రమించాల్సివచ్చేది. ఒకటికి పదిసార్లు చూసుకొని తప్పులు సరిచేసుకోవాల్సి వచ్చేది.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. చాట్‌జీపీటీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలామంది దీని సాయంతో సులువుగా సీవీని క్రియేట్ చేసేస్తున్నారు. అలా ఈ సాంకేతికత సాయంతో ఓ అభ్యర్థి తన సీవీని ఆసక్తికరంగా రూపొందించి కంపెనీకి పంపాడు. అది చూసిన సీఈవో కంగుతిన్నారు.
ఎంట్రేజ్ సంస్థ సీఈవో అనన్య నారంగ్‌కు ఇటీవల ఓ ఉద్యోగం కోసం అప్లికేషన్ వచ్చింది. దాన్ని చూసిన ఆమె షాక్ తిన్నారు. సాధారణంగా చాట్‌జీపీటీని ఫలానా జాబ్ కోసం అప్లికేషన్ క్రియేట్ చేయమని చెబితే.. ఆ ఏఐ ప్లాట్‌ఫామ్ సంబంధిత టెంప్లేట్‌ను చిటికెలో క్రియేట్ చేసి ఇస్తుంది. అయితే అందులోని కొన్ని విషయాలను మనమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ అభ్యర్థి చాట్‌జీపీటీ రూపొందించిన జాబ్ అప్లికేషన్‌ను అలాగే కంపెనీకి పంపించేశాడు.
అందులో స్కిల్స్, ఎక్స్పీరియన్స్ వద్ద ఉదాహరణ.. అని ఉండటాన్ని చూసిన సీఈవో ఆశ్చర్యపోయారు. ఈ అప్లికేషన్ కోసం అభ్యర్థి చాట్‌జీపీటీని ఉపయోగించాడనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నిరుద్యోగం ఉందనడంలో ఆశ్చర్యం లేదంటూ ఆమె వ్యాఖ్యలు జత చేశారు.