Apps Using Microphone Camera In Background :మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్‌లోని మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తోందని కొద్ది రోజుల క్రితం పలువురు టెక్ నిపుణులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను వాట్సాప్ ఖండించింది. ఆండ్రాయిడ్‌లోని బగ్ కారణంగా మైక్ సింబల్ కనిపిస్తుందని తెలిపింది. అయితే ఇలాంటి ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గతంలో అమెజాన్ కూడా ఈకో స్పీకర్ల ద్వారా వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో యూజర్ల మాటలు వింటుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వాటిని కూడా అమెజాన్ కొట్టిపారేసింది.
అలా వినియోగదారులకు తెలియకుండా లేదా పర్మిషన్ లేకుండా యాప్‌లు ఫోన్‌లోని మైక్రోఫోన్ లేదా కెమెరాను ఉపయోగిస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రైవసీ ఉల్లంఘనకు గురువుతుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే యాప్‌లు ప్రైవేట్ సంభాషణలను వినడం లేదా వినియోగదారులకు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేయడం వంటివి చేయవచ్చు.
అయితే కేవలం వాట్సాప్, అమెజాన్ మాత్రమే కాదు మొబైల్ ఫోన్లలో ఉండే యాప్‌లలో చాలా వరకు యూజర్ మైక్రోఫోన్ లేదా కెమెరాను ఉపయోగిస్తుంటాయి. కొన్ని యాప్‌లకు మైక్రోఫోన్ వినియోగం తప్పనిసరి. మరి ఫోన్ లో ఉండే యాప్‌లలో ఏవైనా మీ అనుమతి లేకుండా మైక్రోఫోన్ లేదా కెమెరా ఉపయోగిస్తున్నాయని అనుమానమా? అలాంటి వాటిని ఎలా గుర్తించాలి? యాప్‌లు మైక్రోఫోన్ ఉపయోగించకుండా ఏం చేయాలో చూద్దాం.
ఐఫోన్ వినియోగదారుల కోసం
- మీ iPhoneలో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
- కిందకు స్క్రోల్ చేసి ప్రైవసీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- మైక్రోఫోన్ లేదా కెమెరా ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి.
- ఏయే యాప్‌లు యాక్సెస్ తీసుకున్నాయో చెక్ చేసుకోండి.
- ఏదైనా యాప్‌కు మైక్రోఫన్ లేదా కెమెరా పర్మిషన్ నాట్ అలౌడ్ చేయాలంటే ఎడమ వైపు స్వైప్ చేస్తే చాలు.