Bharati Airtel: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు షాకిచ్చింది. ఇప్పటికే అందిస్తున్న రెండు రీఛార్జి ప్లాన్లపై ఇచ్చే డేటా ప్రయోజనాలను తొలగించింది. వాయిస్, SMSల కోసం ప్రత్యేకంగా రీఛార్జి ప్లాన్లు తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీనిపై ఎయిర్ టెల్ సమాధానం ఇదే:ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లోని లిస్ట్‌లో కంపెనీ తన రీఛార్జి ప్లాన్లపై ఇచ్చే డేటా ప్రయోజనాలను తొలగించడం కనిపించింది. వాటిలో వాయిస్ కాల్స్, SMS ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి. టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో దీనిపై స్పష్టమైన, కచ్చితమైన సమాచారం పొందేందుకు ETV భారత్ ఎయిర్‌టెల్‌ను సంప్రదించింది. అయితే 'సాంకేతిక లోపం వల్లే వెబ్‌సైట్‌లో ప్లాన్‌లు కనిపించాయి. ఇప్పుడు సంబంధిత ప్లాన్‌లను వెబ్‌సైట్ నుంచి తొలగించాం' అని కంపెనీ ఈటీవీ భారత్‌కు వివరణ ఇచ్చింది. అయితే సాంకేతిక సమస్యల కారణంగా ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌లో రూ. 509, రూ. 1999 ప్లాన్‌లలో ఏ మార్పులు కనిపించాయో తెలుసుకుందాం రండి.
ఎయిర్‌టెల్ రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్:ఎయిర్‌టెల్ తన రూ.509 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. ఇది ఇప్పుడు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 SMSలను మాత్రమే అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీని మాత్రం కంపెనీ 84 రోజులుగా అలానే ఉంచింది.
దీనితో పాటు అదనపు ఎయిర్‌టెల్ రివార్డులుగా ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో ఉచిత కంటెంట్, అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్, ఉచిత హలో ట్యూన్స్‌లను కూడా అందిస్తుంది. ఎయిర్‌టెల్ ప్రకారం వాయిస్, SMSలకు మాత్రమే ప్లాన్ ఎఫెక్టివ్ ధర నెలకు దాదాపు రూ.167. గతంలో ఈ ప్లాన్‌లో 6GB డేటా కూడా ఉండేదని గమనించాలి.