Additional Taxes On Electric Buses In Telangana : తెలంగాణ ఆర్టీసీ ఇటీవల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ ఆధునికతను సంతరించుకుంటోంది. ఇంధన భారాన్ని తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వీటిని అందుబాటులోకి తెస్తోంది. అయితే, ఈ బస్సుల్లో గ్రీన్ ట్యాక్స్ పేరుతో టికెట్‌పై అదనపు ఛార్జీ వసూలు చేయడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోతున్నారు. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.10, మిగతా వాటిల్లో రూ.20 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల్లో గ్రీన్‌ట్యాక్స్ పేరిట అదనుపు ఛార్జీలు : ఈ సమాచారాన్ని టికెట్‌పై ముద్రించడం లేదు. తరచూ ప్రయాణించే వారికి మాత్రమే ఈ అదనపు ఛార్జీ గురించి తెలుస్తుంది. దీంతో చెప్పకుండా ఎందుకు వసూలు చేస్తున్నారని కండక్టర్‌లతో వాగ్వాదానికి దిగుతున్నారు. గతంలో టికెట్‌పై బస్ ఛార్జీలతో పాటు టోల్‌గేట్, సెస్ ఛార్జీల వివరాలు ముద్రించేవారు. వరంగల్ రీజియన్‌లో ప్రస్తుతం 74 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. హైదరాబాద్ రూట్లలో డీజిల్ బస్సులను తగ్గించి వీటిని తిప్పుతోంది.
ఎక్స్‌ప్రెస్‌లో రూ.10, మిగతా వాటిలో రూ.20 : ఇందులో 19 డీలక్స్, 34 ఎక్స్‌ప్రెస్, 21 సూపర్ లగ్జరీ ఉన్నాయి. ఇందులో వరంగల్ నుంచి హైదరాబాద్‌కు డీలక్స్ బస్సుకు రూ.260 ఛార్జీ కాగా రూ.280, ఎక్స్‌ప్రెస్ బస్సులకు రూ.200 అయితే రూ.210, సూపర్ లగ్జరీ బస్సులకు రూ.300 అయితే రూ.320 వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ వరంగల్ రీజియన్ మేనేజర్ డి.విజయభానును వివరణ కోరగా ‘ఎలక్ట్రిక్ బస్సుల్లో టికెట్‌పై గ్రీన్ ట్యాక్స్ అదనంగా పడుతుంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. టికెట్‌పై ఈ విషయాన్ని ముద్రించేలా ఉన్నతాధికారులతో మాట్లాడతామని తెలిపారు.
టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మహాలక్ష్మి పథకం అమల్లోకి తెచ్చింది. దీంతో బస్సు ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త బస్సులను రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చింది. టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతుంది. 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో 'పుష్పక' ప్రయాణం - సికింద్రాబాద్ టూ ఎయిర్‌పోర్టు