Best Flowers to Worship Lord Shiva on Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన శివక్షేత్రాలన్నీ హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగుతాయి. పండగరోజు తెల్లవారుజాము నుంచే దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. చాలా మంది ఇంట్లోనూ శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే మహా శివరాత్రి రోజు ఆ పరమశివుడిని ఒక్కో రకమైన పుష్పాలతో పూజించడం వల్ల ఒక్కో ఫలితం కలుగుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. మరి ఆ పువ్వులు ఏంటి, కలిగే ఫలితాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మందార పూలతో : శివరాత్రి రోజు మందార పూలతో శివుడిని పూజిస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు.
పద్మ పుష్పాలు : మనకు తెలియకుండానే ఒక్కోసారి ఇతరులను దూషిస్తుంటాం. అలా తిట్టిన దోషాలన్నీ పోవాలంటే శివరాత్రి రోజు పద్మ పుష్పాలతో శివయ్యను పూజించాలని అంటున్నారు. అలాగే శివరాత్రి రోజు పద్మ పుష్పాలతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు.
గన్నేరు పూలతో : దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహా శివరాత్రి పర్వదినం రోజు ఈశ్వరుడిని గన్నేరు పూలతో పూజించాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందని చెబుతున్నారు. మనం జీవితంలో కొన్నిసార్లు అన్యాయంగా ధనం సంపాదించాల్సి వస్తుంది. అలా అన్యాయంగా సంపాదించిన దోషం పోవాలన్నా గన్నేరు పూలతో పరమేశ్వరుడిని పూజించాలని సూచిస్తున్నారు.
సన్నజాజి పూలతో : శివరాత్రి రోజు సన్నజాజి పూలతో శివుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్నవారు సన్నజాజి పూలతో పూజించి మీ కోరిక ఫలించి తొందరలోనే వివాహం జరుగుతుందని అంటున్నారు.
జాజిపూలతో : మహా శివరాత్రి రోజు జాజిపూలతో శివుడిని పూజిస్తే వాహన యోగం కలుగుతుందని అంటున్నారు.
గులాబీ పూలతో : మనస్సులో చాలా కాలంగా ఏదైనా కోరిక ఉంటే అది తీరడానికి శివరాత్రి రోజు గులాబీ పూలతో శివుడిని పూజిస్తే మీ కోరిక కచ్చితంగా నెరవేరుతుందని అంటున్నారు.
కదంబ పుష్పాలు : మహా శివరాత్రి రోజు కదంబ పుష్పాలతో శివుడిని పూజిస్తే భయంకరమైన దృష్టి దోషాలు, తీవ్రమైన శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని సూచిస్తున్నారు.
దీర్ఘాయుర్దాయం కలగాలంటే : దీర్ఘాయుర్దాయం కలగాలన్నా, అపమృత్యు దోషాలు తొలగిపోవాలన్నా శివరాత్రి రోజు మల్లెపూలతో శివుడిని పూజించాలి. అలాగే వాసన లేని పుష్పాలతో శివుడిని పూజిస్తే దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయని, అంతర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు.
అబ్బాయి జన్మించాలంటే : కొంతమందికి పుత్ర సంతానం కావాలని కోరిక ఉంటుంది. ఇలాంటి వారు శివరాత్రి రోజు ఎర్ర కాడలు ఉన్నటువంటి ఉమ్మెత్త పూలతో శివుడిని పూజించాలని చెబుతున్నారు.
పచ్చ గోరింట పూలు : శివరాత్రి రోజు పచ్చ గోరింట పూలతో శివుడిని పూజిస్తే జనాకర్షణ, ప్రజాకర్షణ పెరుగుతాయని, ఎదుటి వాళ్లను మీ మాట శక్తితో ఆకర్షింపజేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే, మీరు ఏ పుష్పాలతో శివయ్యను పూజిస్తున్నా మధ్యలో దవనం కట్టి సమర్పిస్తే చాలా మంచిదని మాచిరాజు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
దేశంలోనే మూడో అతిపెద్ద శివుడి విగ్రహం ఆంధ్రాలో! - ఈ శివరాత్రికే ఆరంభం!