Maha shivaratri Special Sweet Recipes : పరమ పవిత్రమైన మహా శివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది. ఈ పండగ రోజున ఇంటా బయటా మంత్రాల నామస్మరణతో సందడి వాతావరణం కనిపిస్తుంది. భక్తిప్రపత్తులతో పూజలు చేస్తాం. ఇక ఉపవాసం, జాగరణ చేసి ఆ ముక్కంటిని వేడుకుంటాం. అంతేనా, పరమేశ్వరుడికి పూలూ పండ్లతోబాటు పరవన్నం నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే, ఎప్పుడూ ఒకటే రకం ప్రసాదాలు కాకుండా ఈసారి ఈశ్వరుడికి ఈ నివేదనలు సమర్పించండి. మరి ఆ ప్రసాదాల తయారీ, కావాల్సిన పదార్థాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
యాపిల్ షీరా:
కావలసిన పదార్థాలు:
- ఊదలు - ముప్పావు కప్పు
- యాపిల్ పండ్లు - 2
- చిక్కటి పాలు - ఒకటిన్నర కప్పు
- బెల్లం పొడి - అర కప్పు
- నెయ్యి - పావు కప్పు
- యాలకుల పొడి - అర చెంచా
- కుంకుమపువ్వు - కొద్దిగా
- డ్రైప్రూట్స్ పలుకులు - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:
- ఊదలను శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత దోరగా వేయించి, బరకగా గ్రైండ్ చేయాలి.
- యాపిల్స్ పై పొట్టు, గింజలు తీసి గుజ్జు చేయాలి.
- స్టవ్ ఆన్ చేసి అడుగుభాగం మందంగా ఉన్న పాత్ర పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి.
- అందులో యాపిల్ గుజ్జు, ఊదల మిశ్రమం, బెల్లం పొడి, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి కలియతిప్పుతూ సన్నసెగ మీద దగ్గరపడేంతవరకు ఉడికించాలి.
- చివర్లో డ్రైప్రూట్స్ పలుకులు జోడించి స్టవ్ ఆఫ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకుని నైవేద్యంగా సమర్పించాలి.
బొప్పాయి హల్వా
కావలసినవి:
- పంచదార - ముప్పావు కప్పు
- నెయ్యి - అర కప్పు
- పాల పొడి- పావు కప్పు
- బొప్పాయి పండ్లు - 2
- యాలకుల పొడి - అర చెంచా
- డ్రైప్రూట్స్ పలుకులు - చారెడు
తయారీ విధానం:
- బొప్పాయి పండ్ల చెక్కు తీసి శుభ్రంగా కడిగి అందులోని గింజలు తీసేయాలి.
- ఆ తర్వాత బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి గుజ్జులా చేయాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక బొప్పాయి గుజ్జు వేసి సన్న సెగ మీద గరిటెతో కలుపుతూ ఉండాలి.
- సుమారు పది నిమిషాల తర్వాత పంచదార వేసి కలపాలి. మిశ్రమం నుంచి నెయ్యి విడిపోయాక మిల్క్ పౌడర్ జోడించి కలుపుతూనే ఉండాలి. లేకుంటే ఉండలు కడుతుంది. బొప్పాయి మిశ్రమం నుంచి నెయ్యి పైకి తేలి పాన్కు అంటుకోకుండా సెపరేట్ అయినప్పుడు డ్రైప్రూట్స్ పలుకులు వేసి దించి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఈ హల్వాను నైవేద్యంగా సమర్పించి మీరూ ఆరగించండి.
మహాశివరాత్రి అసలైన ముహూర్తం ఎప్పుడు? - పవిత్ర లింగోద్భవ సమయం ఇదే! - ఇలా పూజించాలి!
ఈ శివరాత్రికి "మహా ఆదియోగి" దర్శనం - తెలుగు భక్తులు ఇలా వెళ్లొచ్చు!
శివుడికి బిల్వపత్రం సమర్పణ - ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసా?