Sisters kills Brother For Property In Jagtial : డబ్బు, ఆస్తి కోసం తన, మన అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. సమాజం ఎలా మారిందంటే బంధువులు, బంధుత్వం ముఖ్యం కాదు, డబ్బే ముఖ్యం అన్నట్లు ఏం చేయడానికైనా వెనకాడట్లేదు! ఆస్తి కోసం సొంత వారిని సైతం మోసం చేసే వారు కొందరైతే, కొంత మంది హత్యలు కూడా చేస్తున్నారు. కన్న తల్లిని రోడ్డుపైకి నెట్టేసిన కుమారులు, అక్కను మోసం చేసిన తమ్ముడు ఇలా చాలా సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో 100 గజాల స్థలం కోసం అన్నపై కర్రలతో దాడి చేసి హతమార్చారు ఇద్దరు చెల్లెళ్లు.
పోలీసుల వివరాల ప్రకారం : జగిత్యాల పోచమ్మవాడకు చెందిన జంగిలి శ్రీనివాస్ (52) ఆర్టీఏ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. శ్రీనివాస్‌కు ఒక సోదరుడు, ముగ్గురు చెల్లెళ్లు ఉన్నారు. అందరికీ వివాహలు జరిగాయి. మొదటి సోదరి (చెల్లెలు) భారతపు వరలక్ష్మి భర్త 22 ఏళ్ల కిందట మృతి చెందడంతో పుట్టింట్లోనే ఉంటోంది. మూడో సోదరి (చెల్లెలు) వొడ్నాల శారద భర్త వదిలేయడంతో శ్రీనివాస్ ఇంటి పక్కనే అద్దెకు నివసిస్తోంది.
స్థల వివాదంలో అన్నపై చెల్లెళ్ల దాడి : తండ్రి బసవయ్య తనకున్న 100 గజాల భూమిని శ్రీనివాస్‌కు ఇస్తానని 10 ఏళ్ల కిందట పేర్కొనడంతో అప్పటి నుంచి వరలక్ష్మి, శారద ఆ భూమి తమకు కావాలంటూ గొడవ పడుతున్నారు. ఈ విషయమై కోర్టులో విచారణ జరుగుతోంది. తరచూ గొడవలు జరుగుతుండడంతో శ్రీనివాస్ తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లి బయట అద్దెకు ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ తల్లిదండ్రులను చూసేందుకు పోచమ్మవాడలోని ఇంటికి రాగా, అక్కడే ఉన్న ఇద్దరు చెల్లెళ్లు అతనితో గొడవపడ్డారు.
ఆసుపత్రికి తరలించేలోపు మృతి : వరలక్ష్మి బసవయ్య చేతిలోని కర్రతో, శారద చేతులతో దాడి చేయగా శ్రీనివాస్ కింద పడిపోయాడు. స్పృహ కోల్పోయిన శ్రీనివాస్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. వరలక్ష్మి, శారద కొట్టడం వల్లే తన భర్త మృతి చెందినట్లు శ్రీనివాస్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ చెప్పారు.
చుట్టూ జనం ఉన్నారన్న భయమే లేదు - బస్టాప్‌లో తండ్రిని పొడిచి చంపిన కుమారుడు
మేడ్చల్‌లో దారుణం - వెంటాడి, వేటాడి అన్నను హత్య చేసిన సొంత తమ్ముళ్లు