Pushpa 2 Stampede : పుష్ప-2 బెనిఫిట్ షోను చూసేందుకు వచ్చిన అభిమానులతో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. బెనిఫిట్ షో కోసం బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ రావడంతో తమ స్టార్ హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేసి అభిమానులను చెదరగొట్టారు.
పోలీసులు చెదరగొట్టే సమయంలో తొక్కిసలాట జరగడంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు. ఆ తర్వాత వెంటనే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందారు. ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారడంతో నిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పుష్ప-2 బెనిఫిట్ షోను చూసేందుకు మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు వచ్చారు. వారిలో తల్లి, కుమారుడు తొక్కిసలాటలో కిందపడి గాయాలు కాగా, తల్లి మృతి చెందింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. అలాగే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.