Tirumala Special Darshan Tickets for April 2025 : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతుంటారు. అయితే, శ్రీవారి దర్శనభాగ్యం మాత్రమే కాకుండా ఆ వెంకన్నకు సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా 3 నెలల ముందుగానే ఆన్లైన్ ద్వారా ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకునే వీలును కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ నెలలో తిరుమల వెళ్లే భక్తుల కోసం స్పెషల్ దర్శన టికెట్లతోపాటు పలు సేవల టికెట్ల విడుదల తేదీని ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
23న అంగప్రదక్షిణం టోకెన్లు : ఏప్రిల్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జనవరి 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొంది టీటీడీ. అదేవిధంగా, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆన్లైన్ కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జనవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
24న ప్రత్యేక దర్శన టికెట్లు : ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన స్వామివారి స్పెషల్ దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) విడుదల చేయనున్నారు. అలాగే, తిరుమల, తిరుపతిలలో ఆ నెలకు సంబంధించిన గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తారు.
27న శ్రీవారి సేవ కోటా : శ్రీవారి సేవ కోటా టికెట్లను 27న మార్నింగ్ 11 గంటలకు విడుదల చేయనున్నారు. నవనీత సేవ టికెట్లు మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టోకెన్లు ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. కాబట్టి, సమ్మర్లో తిరుమల వెళ్లే భక్తులు శ్రీవారి ఆర్జితసేవలు, స్పెషల్ దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ను సందర్శించి ఆయా టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.
ఇప్పటికే ఆ టికెట్లు విడుదల : ఏప్రిల్ 10 నుంచి 12 వరకు నిర్వహించనున్న స్వామివారి సాలకట్ల వసంతోత్సవాలు, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే జనవరి 21న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది. అలాగే, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కేటాయింపునకు సంబంధించి ఏప్రిల్ కోటాను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది.
ఇవీ చదవండి :
సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం - ఆ రోజు నుంచి మళ్లీ యథావిధిగా జారీ!
టీటీడీ అన్న ప్రసాదంలో ఫేమస్ వంటకం - సోమవారం నుంచి ప్రారంభించిన అధికారులు