Alaknanda Kidney Racket Case Update : హైదరాబాద్ సరూర్ నగర్‌లో అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి నిజమేనని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఆర్ధిక కారణాలతోనే తమిళనాడు, కర్నాటకల నుంచి వచ్చిన ఇద్దరు వితంతువులు కిడ్నీలు విక్రయించినట్లు ఒప్పుకున్నారని డీఎంఈ వాణి వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ఉస్మానియా ఆస్పత్రి మాజీ సుపరింటెండెంట్ నాగేందర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు. కిడ్నీ మార్పిడి కోసం వచ్చిన ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు మొత్తం నలుగురు గాంధీ ఆసుపత్రిలో ఉన్నారు.
ఆ డాక్టర్లను కఠినంగా శిక్షిస్తాం : డాక్టర్ నాగేంద్ర నేతృత్వంలోని నలుగురు సభ్యుల కమిటీ కిడ్నీ దాతలు, గ్రహీతలతో మాట్లాడింది. విచారణ సమయంలో కిడ్నీ దాతలు పూర్ణిమ అనే మహిళ పేరు ప్రస్తావించారని డీఎంఈ వాణి తెలిపారు. కుటుంబ, ఆర్థిక కారణాలతో కిడ్నీలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు చెప్పారని అన్నారు. కిడ్నీలు ఇచ్చిన ఇద్దరు మహిళలు కూడా వితంతువులేనని, కిడ్నీ దాతలు, గ్రహీతలు కన్నడ, తమిళం మాట్లాడుతున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాలకి చెందిన వారిని రాష్ట్రానికి తీసుకొని వచ్చి కిడ్నీ రాకెట్ నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అలకనంద ఆస్పత్రికి సంబంధించి ఒక ప్లాస్టిక్ సర్జన్‌కు మాత్రమే గుర్తింపు ఉందని, నిజానికి ఆ ప్లాస్టిక్ సర్జనే ఈ కిడ్నీ శస్త్ర చికిత్సలు చేశారా? లేదా అని ఆరా తీస్తున్నామని అన్నారు. అనుమతి లేకున్నా శస్త్ర చికిత్స చేసిన వైద్యులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. డాక్టర్ నాగేంద్ర కమిటీ ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కి నివేదిక ఇవ్వనుంది.
పేదలకు డబ్బు ఆశ చూపి : పోలీసులు, వైద్యారోగ్య శాఖ అధికారులు తనిఖీ చేసిన సమయంలో ఆసుపత్రిలో ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలను గుర్తించారు. నలుగురిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించగా ఇద్దరు మహిళల కిడ్నీలను శస్త్ర చికిత్స ద్వారా తొలగించి ఇద్దరు వ్యక్తులకు అలకనంద ఆసుపత్రి వైద్యులు అమర్చినట్టు తేలింది. ఆర్నెళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఎప్పటి నుంచి ఈ అక్రమ దందా సాగుతోంది? ఎవరైనా దళారులుగా ఉన్నారా? ఇప్పటి వరకు ఎంత మందికి కిడ్నీ మార్పిడి చేశారనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రి యాజమాన్యం కిడ్నీ గ్రహీతలు ఒక్కొక్కరి నుంచి 50 లక్షలకు పైగా నగదు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. పేదలకు డబ్బు ఆశ చూపి దళారులు వీరిని ఆసుపత్రికి తీసుకువచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఎంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని వైద్యవిద్య సంచాలకులు వాణి స్పష్టం చేశారు.
ఆసుపత్రిని మూసేయాలి : ఇలాంటి ఆసుపత్రులపై నిరంతరం తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆసుపత్రిని మూసేయాలని ఏఐవైఎఫ్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
నగరంలో కలకలం : సరూర్‌నగర్‌లోని అలకనంద ఆసుపత్రిలో అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయనే సమాచారంతో మంగళవారం రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, పోలీసులు దాడులు చేశారు. తనిఖీల్లో భాగంగా కిడ్నీ మార్పిడి కోసం ఇద్దరు దాతలు, ఇద్దరు గ్రహీతలు ఉన్నట్లు అనుమానించిన అధికారులు నలుగుర్నీ గాంధీ ఆసుపత్రికి తరలించారు.