Hyderabad Police Arrested Burhanuddin : సీబీఐ కేసు నుంచి తప్పిస్తానని చెప్పి ఓ ఐఏఎస్ అధికారి నుంచి కోటిన్నర వసూలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యక్తిగత సహాయకుడినంటూ ఝార్ఖండ్ సీఎం కార్యాలయంలో కొందరిని మభ్యపెట్టి కోట్లు రూపాయలు వసూళ్లు చేసీ ఈడీ నోటీసుల్ని రద్దు చేయిస్తానంటూ హైదరాబాద్‌లో ఓ వ్యాపారి నుంచి రూ.3 కోట్లు వసూలు చేశారు. ప్రముఖులతో పరిచయాల పేరుతో ఓ మోసగాడు చేసిన నేర చరిత్ర ఇది. జాతీయ రాజకీయ ప్రముఖులతో ఫోటోలు దిగి దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరిలించారు.
హైదరాబాద్‌లోని జుబ్లిహిల్స్‌కు చెందిన సయ్యద్ బుర్హానుద్దీన్ స్థిరాస్తి వ్యాపారి. ప్రధాని, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రముఖలందిరీతో ఫొటోలు దిగుతుంటాడు. ఈ ఫోటోలను వివిధ రంగాల ప్రముఖులకు చూపించి రాజకీయ ప్రముఖులంతా తనకు బాగా పరిచయస్థులని నమ్మిస్తాడు. అవతలి వ్యక్తులు నమ్మినట్లు భావిస్తే ఇక దందా మొదలెడతాడు.
కేసు నుంచి తప్పిస్తానని కోటిన్నర వసూలు : 2016లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ ఐఏఎస్ అధికారిపై సీబీఐ విచారణ జరిగింది. అది అవకాశంగా తీసుకున్న నిందితుడు బుర్హానుద్దీన్ సదరు ఐఏఎస్‌ను కలిశాడు. తనకు ప్రధానమంత్రి కార్యాలయంలో పరిచయాలున్నాయని, కేసు నుంచి తప్పిస్తానని ఐఏఎస్‌ను నమ్మించి కోటిన్నర వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మోసం గురించి తెలుసుకున్న సీబీఐ బుర్హానుద్దీన్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అయిన అతడి దందా ఆగలేదు. ఆ తర్వాత ఝార్ఖండ్ సీఎం కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యక్తిగత సహాయకుడినంటూ నమ్మబలికి కొందరు అధికారులతో లాబీయింగ్ చేసి మైనింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ కోట్లు వసూలు చేశాడు. జార్ఖండ్ పోలీసులకు తెలియడంతో బుర్హానుద్దీన్‌ను అరెస్టు చేశారు.
సెటిల్ చేస్తా అని రూ.3కోట్లు : ఆ తరువాత మోసగాడు బుర్హానుద్దీన్ దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. నగరానికి చెందిన ఓ వ్యాపారికి గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న బుర్హానుద్దీన్ ఈడీ అధికారులతో మాట్లాడి నోటీసులు వెనక్కితీసుకొనేలా చేస్తానని వ్యాపారిని నమ్మించి దిల్లీ తీసుకెళ్లాడు. హోటల్లో ఈడీ అధికారులంటూ కొందరు ప్రైవేటు వ్యక్తులతో మాట్లాడి కేసు సెటిల్ చేస్తున్నట్లు వ్యాపారిని నమ్మించి రూ.3 కోట్లు వసూలు చేశాడు. కొన్నిరోజుల తర్వాత సదరు వ్యాపారికి అనుమానం రావడంతో, ఈడీ అధికారులు సైతం అతనిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి మోసాలు అనేక రాష్ట్రాల్లో చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైతం కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు.
పీడీ చట్టం : అనేక రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్న బుర్హానుద్దీన్ మారుపేర్లతో చలామణీ అవుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. న్యాయవాదిగా, పీఎం, వివిధ రాష్ట్రాల సీఎం కార్యాలయాల్లో పరిచయాలున్నాయంటూప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగర శివారు ప్రాంతాలలోను భూ కబ్జాలు ఇలా వరుసగా మోసాలకు పాల్పడుతున్న బుర్హానుద్దీన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఇటీవల అతడి ఆచూకీ లభించడంతో అరెస్టు చేసి బుర్హానుద్దీన్ నేపథ్యం గురించి ఆరా తీయగా నేర చరిత్ర అంతా బయటపడింది. బుర్హానుద్దీన్‌పై రౌడీషీట్‌తో పాటు పీడీ చట్టం ప్రయోగించడానికి ఉన్న సాధ్యాసాద్యాలను పరిశీలిస్తామని పోలీసులు వెల్లడించారు.