Union Home Minister Call To CM Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని అమిత్ షాకు సీఎం వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అవసరమైన వరద సహాయక చర్యలు అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
కేంద్రహోం మంత్రికి బండి సంజయ్ ఫోన్ :అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా అమిత్ షాకు రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నష్టం భారీగా ఉందని వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలను ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తూ ఆదేశాలు జారీచేశారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం :రేపు, ఎల్లుండి కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడితే వరద ముంపు మరింత పెరిగే అవకాశముంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
అన్ని విశ్వవిద్యాలయాలు రేపు తమ పరిధిలో జరిగే పరీక్షలను వాయిదా వేశాయి. వీలైనంత ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అధికారికంగా తొమ్మిది మంది చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఖమ్మంలో మున్నేరు వాగు ఉద్ధృతిలో చిక్కుకుపోయిన 9 మందిని రక్షించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.