Hydra Demolition : గచ్చిబౌలిలోని ఖాజాగూడ భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చేశారు. ఖాజాగూడ సర్వే నంబరు 18 ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో తొమ్మిది ఎకరాలు, ఏడు గుంటల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రెండు చెరువుల ఆక్రమణలు తొలగించి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరిశీలించి 20కి పైగా దుకాణాలను అధికారులు తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. మరోవైపు నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలు కూల్చేయడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత తక్కువ సమయంలో ఎలా ఖాళీ చేయాలంటూ వాపోయారు.
'అధికారికమైనా, అనధికారికమైనా గతంలో నిర్మించిన ఇళ్ల జోలికి హైడ్రా వెళ్లదు - ఆ భవనాలను మాత్రం వదలం'
భగీరథమ్మ, తౌతానికుంట చెరువుల్లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రా స్పందించింది. నోటీసులు ఇచ్చాక కూల్చివేతలు జరిపినట్లు స్పష్టం చేసింది. ఆ రెండు చెరువుల్లోని 10 అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా 10 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు.