How to Make Chintapandu Charu : కొంతమందికి భోజనంలో పులుసు లేదా చారు లేకపోతే అన్నం అంతగా తినాలనిపించదు. టమాటా చారు, పప్పు చారు, సాంబార్ వంటివి ఏదో ఒకటి తప్పక ఉండాల్సిందే. అయితే, ఎప్పుడూ ఇవే తినాలంటే కాస్త బోరింగ్ ఫీల్ కలుగుతుంది. అలాకాకుండా ఓసారి ఇలా "చింతపండు చారు" చేసుకొని చూడండి.
వణికిస్తున్న చలిలో.. వేడి వేడి చారుతో అన్నం జుర్రుకుంటే ఆ టేస్టే వేరు. సూపర్ టేస్టీగా ఉండే ఈ చారుతో అన్నం తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ముద్ద పప్పు, నాన్‌వెజ్ ఫ్రై రెసిపీల్లోకి సైడ్ డిష్‌గా అద్దిరిపోతుంది. పైగా ఇది చేయడానికి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. మరి, ఈజీగా చింతపండు చారు చేయడానికి ఏయే పదార్థాలు అవసరం? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజంత
- వెల్లుల్లి రెబ్బలు - 5
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు- 2
- టమాటా-2
- తాలింపు గింజలు - 2 టీస్పూన్లు
- పసుపు - అర టీస్పూన్
- కారం -టేబుల్‌స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వాటర్ సరిపడా
- కరివేపాకు -2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి-3
తయారీ విధానం :
- ముందుగా చింతపండు 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకోండి. ఈ టైమ్‌లో చారులోకి కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి.
- ఆ తర్వాత చింతపండు రసం రెడీ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో చారుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి.
- ఆపై పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కరివేపాకు వేయండి. అలాగే ఉప్పు, కారం, పసుపు వేయండి.
- ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ ముక్కలను చారులోనే చేతితోనే మెత్తగా చిదుముకోవాలి.
- తర్వాత ఈ గిన్నెను స్టౌపై పెట్టండి. చారుని 10 నిమిషాల సేపు మరిగించుకోండి.
- అనంతరం చారులో ఉప్పు, కారం రుచికి సరిపోయే విధంగా ఉన్నాయో చెక్ చేసుకోండి. వీలైతే రుచికి సరిపడా వేసుకుని స్టౌ ఆఫ్ చేసుకోండి.
- ఇప్పుడు తాలింపు కోసం స్టౌపై మరో గిన్నె పెట్టండి. ఇందులో ఆయిల్ వేసి వేడి చేయండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి.
- అలాగే తాలింపు గింజలు వేసి దోరగా వేపండి. అలాగే ఎండుమిర్చి, కొత్తిమీర తరుగు వేసి ఫ్రై చేయండి. ఇందులో మరిగించుకున్న రసం వేసి కలపండి.
- అంతే.. ఇలా సింపుల్‌గా చేసుకుంటే ఎంతో రుచికరమైన చింతపండు రసం రెడీ.
- నచ్చితే ఈ విధంగా చింతపండు రసం ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.
చూస్తేనే నోరూరిపోయే "తెలంగాణ స్టైల్ పచ్చి పులుసు" - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే!
జలుబు, జ్వరంతో నోటికి ఏం రుచించట్లేదా? - ఇలా "అల్లం నిమ్మకాయ రసం" చేసుకొని తినండి!