Best Foods to Consume in Winter: ఉష్ణోగ్రతలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే చలి నుంచి రక్షించుకునేందుకు జనం అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ కాలంలో అజీర్తి, జలుబు, దగ్గు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
అయితే.. కొందరికి చలి చాలా తీవ్రంగా అనిపిస్తుంది. దీనికి విటమిన్స్ లోపం ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే.. చలికాలంలో ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు. మరి, ఈ కాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం.
చిలగడ దుంపలు: శీతాకాలంలో ఇవి విరివిగా లభిస్తాయి. రుచిలో కూడా చాలా బాగుంటాయి. అయితే.. ఈ కాలంలో వచ్చే చర్మ, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వీటిని తినడం మేలని నిపుణులు అంటున్నారు. అయితే.. కొందరు వాతం అని వీటిని తినరు. కానీ, దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని చెబుతున్నారు. ఈ దుంపల్లో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ చర్మానికి తేమనిచ్చి మృదువుగా చేస్తాయని అంటున్నారు. స్వీట్ పొటాటో బదులు క్యారెట్, ఆకుకూరలూ మంచివే అంటున్నారు.
బ్రొకలీ: సాధారణంగా చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీంతో చాలా మంది విటమిన్ సి కోసం సిట్రస్ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ నారింజ కన్నా బ్రొకలీలో రెండురెట్లు అధికంగా సి విటమిన్ ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందని సూచిస్తున్నారు. మిగతా పండ్లతో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ దీనిలో కాస్త ఎక్కువే అంటున్నారు. బ్రొకలీలోని విటమిన్ సి బాడీలో ఇమ్యూనిటీని పెంచుతుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు సంబంధించిన నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
గుడ్డుసొన: మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో విటమిన్ డి శరీరానికి అవసరమైనంత అందదు. అందుకే.. బద్ధకం, అజీర్తి, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే చేపలు, గుడ్డు సొన, పాలు, పాలసంబంధిత పదార్థాల్ని ఎక్కువగా తినాలని చెబుతున్నారు. గుడ్డుసొన జీర్ణం కాదనీ, బరువు పెరుగుతారనీ చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ ఒక గుడ్డు సొనలో 37 ఐ.యుల డి విటమిన్ ఉంటుందని వివరిస్తున్నారు.
సూప్స్: చలికాలంలో ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే వేడివేడిగా సూప్స్ తాగడం మంచిదంటున్నారు. తాజా కూరగాయలు, మొలకెత్తిన గింజలు, బీన్స్, మాంసం.. వంటి పలు పదార్థాలతో వేడివేడిగా సూప్స్ తయారుచేసుకొని తీసుకోవాలని.. తద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లూ సోకకుండా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జలుబు, జ్వరంతో నోటికి ఏం రుచించట్లేదా? - ఇలా "అల్లం నిమ్మకాయ రసం" చేసుకొని తినండి!
చలికాలం దగ్గు, గ్యాస్ ట్రబుల్ వేధిస్తున్నాయా? - వంటింట్లో ఉండే దీన్ని రోజూ కొద్దిగా తీసుకుంటే చాలట!