Pindi Pulihora Recipe : పులిహోర చెప్పగానే చాలా మందికి నోరూరిపోతుంది. అందుకు దాంట్లోని పులుపు, కమ్మదనమే కారణం. అయితే, మీరు ఇప్పటివరకు అన్నంతో చేసుకునే చింతపండు, నిమ్మకాయ పులిహోరను ఎక్కువగా తిని ఉంటారు. కానీ, ఎప్పుడైనా పిండి పులిహోరను టేస్ట్ చేశారా? లేదు అంటే మాత్రం ఓసారి తప్పక రుచి చూడాల్సిందే. నార్మల్ పులిహోరను మించిన టేస్ట్‌తో నోరూరిస్తోంది ఈ పిండి పులిహోర. దీన్నే 'రవ్వ పులిహోర, పులావ్ ఉప్మా' అని పేర్లతో కూడా పిలుస్తారు. పైగా చాలా తక్కువ పదార్థాలతో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. మరి, ఈ సింపుల్ అండ్ టేస్టీ పులిహోరకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యపు రవ్వ - 1 కప్పు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- పల్లీలు - 2 టేబుల్‌స్పూన్లు
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- మినప్పప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 5
- ఇంగువ - కొద్దిగా
- కరివేపాకు - 2 రెమ్మలు
- పచ్చిమిర్చి - 4
- పసుపు - చిటికెడు
- చింతపండు - నిమ్మకాయ సైజంత
- ఉప్పు - రుచికి సరిపడా
సూపర్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ - పుల్లపుల్లని "సేమియా పులిహోర" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. అవి వేగాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకొని కాసేపు వేపుకోవాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, సన్నని పచ్చిమిర్చి చీలికలు, పసుపు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి.
- ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుంచి తీసిన 2 కప్పుల కంటే కాస్త ఎక్కువ పల్చని చింతపండు రసం చక్కగా వేగిన తాలింపులో పోసుకోవాలి. ఆపై ఉప్పు వేసి కలిపి హై-ఫ్లేమ్ మీద రసాన్ని బాగా మరిగించుకోవాలి.
- వాటర్ బాగా మరిగి తెర్లుతున్నప్పుడు బియ్యపు రవ్వను వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూతపెట్టి స్టౌను సిమ్‌లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ రవ్వ మిశ్రమం చక్కగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి.
- రవ్వ మిశ్రమం చక్కగా ఉడికి పొడిపొడిగా మారిందనుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని దింపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఘుమఘుమలాడే కమ్మని "పిండి పులిహోర" రెడీ!
- మరి, నచ్చిందా? అయితే మీరు ఓసారి ఈ పిండి పులిహోరను ట్రై చేయండి. సరికొత్త రుచితో వావ్ అనిపించే ఈ రెసిపీని ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.
అన్నం, టిఫెన్స్లోకి అద్దిరిపోయే "పులిహోర పొడి" - ఇలా చేసుకున్నారంటే 6 నెలల పాటు నిల్వ!