Delhi Assembly Elections Polling : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు తమ ఓట్లను ఈవీఎమ్ల్లో నిక్షిప్తం చేశారు. ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటల వరకు కొనసాగింది. ఫిబ్రవరి 8
ఓట్ల లెక్కింపు రోజున అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఈ నేపథ్యంలో దిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రపతిసహా వివిధ రాజకీయ పార్టీల నేతలు, వివిధ రంగాల ప్రముఖులు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలో ఓటు వేశారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, విశ్రాంత సీజేఐ డీవై చంద్రచూడ్, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కేంద్రమంత్రులు జైశంకర్, హర్ దీప్‌సింగ్‌పూరీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ తన భర్త రాబర్ట్ వాద్రా, కుమారుడితో కలిసి వెళ్లి ఓటువేశారు. మాజీ సీఎం కేజ్రీవాల్, దిల్లీ సీఎం అతిశీ, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్, మాజీమంత్రి సత్యేంద్రజైన్ తన సతీమణితో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు.
మయూర్‌విహార్‌లో బీజేపీ దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా తన సతీమణితో కలిసి ఓటువేశారు. సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారాట్ తన సతీమణి బృందా కారాట్‌తో కలిసి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠీ ఓటువేసిన తర్వాత పోలింగ్ బూత్‌లో సెల్ఫీ తీసుకున్నారు. కె.కామ్రాజ్ లైన్‌లో సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది తన సతీమణితో కలిసి వెళ్లి ఓటేశారు.
అంతకుముందు, దిల్లీ ప్రజలందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న యువతకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.
ఫస్ట్ ఓటర్స్ వీళ్లే
దిల్లీలో పురుషుల్లో ఉమేశ్‌గుప్తా, మహిళల్లో ప్రేరణ తొలుత ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిని అభినందిస్తూ ఈసీ ఓసర్టిఫికెట్ ఇచ్చింది. దిల్లీలోని 70 శాసనసభస్థానాలకు 699మంది పోటీలో ఉన్నారు. కోటి 56లక్షల మంది ఓటర్లు ఉండగా వారికోసం ఈసీ 13 వేల 766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. భద్రతా చర్యల్లో భాగంగా 220కంపెనీల పారామిలిటరీ బలగాలతోపాటు 19వేల మంది గార్డులు, 35,626 మంది పోలీసులను మోహరించారు.