Cyber Cases In Hyderabad : నగరంలో నేరాల తీరే వేరు. నేరగాళ్లు, మోసగాళ్లు వారి పంథాలను మార్చుకుంటున్నారు. వీరి ఉచ్చులో చిక్కి బలవుతున్న వారిలో విద్యావంతులే ఎక్కువగా ఉండటం విశేషం. ఆర్థిక నేరాలు, డ్రగ్స్ దందా నగరంలో ఈ సంవత్సరం పెరిగింది. పోలీసులకు చిక్కకుండా ఎక్కడో ఉంటూ ఇక్కడ సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి. కొత్త సంవత్సరంలోనైనా ఇలాంటి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని 2024 సంవత్సరం సూచిస్తోంది.
డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలు : పెరుగుతున్న ఖర్చులు చాలీచాలని జీతాలతో అదనపు ఆదాయం కోసం మధ్యతరగతి కుంటుంబాలు ప్రత్నామ్నాయాలపై మొగ్గు చూపుతున్నారు. పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో, పెట్టుబడులు, స్టాక్‌మార్కెట్లు మాయలో పడి ప్రజలు మోసపోతున్నారు. ఈ సంవత్సరం కొత్తగా కొందరు మాయగాళ్లు డిజిటల్ అరెస్టులు, పిల్లలను కిడ్నాప్ చేశామంటూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు మా సంస్థలో పెట్టుబడితో రెండేళ్లలో మూడింతల ఆదాయం అంటూ కొందరు సొంతింటి కలను నిజం చేసుకునేందుకు ప్రీలాంచింగ్ ఆఫర్లు, ఆకట్టుకునే పథకాలతో నేరస్థులు ఎత్తుగడలు వేస్తున్నారు. 2024లో ఆర్థిక, సైబర్ మోసాలతో రూ. 4వేల కోట్లు కొల్లగొట్టారు.
వీటి పేరుతో మోసాలు : బిజినెస్, కస్టమర్‌కేర్, ప్రకటనలు, డేటా చోరీ, డేటింగ్, బహుమతులు, హ్యాకింగ్, హనీట్రాప్, ఐడెంటిటీ దొంగతనం, గేమింగ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్, జాబ్, లోన్, లాటరీ, మ్యాట్రిమోనియల్, ఓటీపీ, ఫిషింగ్, సిమ్, సోషల్ మీడియా, ట్రేడింగ్, వీసా, వాట్సాప్ డీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులు, చిట్‌ఫండ్స్, ప్రీలాంచింగ్, కంపెనీల్లో పెట్టుబడులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల పేరుతో మోసాలు చేస్తున్నారు.
"గతంలో లాటరీ బహుమతుల పేరుతో మోసగించేవారు. ప్రస్తుతం క్రిస్మస్, నూతన సంవత్సరం వంటి పండగలను ఉపయోగించుకుంటున్నారు. ఆన్‌లైన్ ద్వారా బహుమతులు పంపుతామంటూ వివరాలు సేకరించి డబ్బులు కొట్టేస్తున్నారు కేటుగాళ్లు.బాధితులు మోసపోయినట్లు గ్రహించగానే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి." -శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసైబర్
సరికొత్తగా ‘మత్తు’ దందా : మరోవైపు 2023లో దాదాపు 14 వేల కిలోల గంజాయి పట్టుబడగా ఈ ఏడాది 6,400 కిలోల సరకు చిక్కడమే ఇందుకు ఉదాహరణ. మొత్తంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
కొత్త తరహా డ్రగ్స్ : హైదరాబాద్‌లో మత్తు దందా మరింత విస్తృతమవుతోంది. ఇప్పటి వరకు గంజాయి, హ్యాష్ ఆయిల్ వంటి సరుకు ఎక్కువగా పట్టుబడేది. వీటికితోడు నగరంలో కొత్తగా సింథటిక్ డ్రగ్స్ వినియోగం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. హెరాయిన్, కొకైన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ తదితర మత్తు పదార్థాలు గుట్టుగా హైదరాబాద్‌కు వస్తున్నాయి.
పార్టీ సంస్కృతి పేరుతో కొత్త తరహా డ్రగ్స్ తెప్పించుకుని మత్తులో మునిగిపోతున్నారు యువత. నగరంలో గత కొన్నేళ్లుగా గంజాయి స్వాధీనం పెరుగుతూ ఉండేది. తెలంగాణ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, టాస్క్‌ఫోర్స్, హెచ్‌న్యూ, ఎస్‌వోటీ పోలీసులు ఆబ్కారీ శాఖ తరచూ తనిఖీలతో ఇటీవల గంజాయి రవాణా తగ్గుతూ వస్తోంది. పోలీసులు స్వాధీనం చేసుకునే సరకు విలువ తగ్గుముఖం పడుతోంది. ఇదే స్థానంలో హ్యాష్ ఆయిల్ ఇతర మత్తు పదార్థాల రవాణా రోజురోజుకూ పెరుగుతోంది.
సింథటిక్ డ్రగ్స్ : సింథటిక్ డ్రగ్స్‌లో మెజార్టీ సరకు గోవా, బెంగళూరు నుంచి వస్తున్నాయి. నగరంలో డ్రగ్స్ ఎప్పుడు పట్టుబడ్డ దాని మూలాలు కచ్చితంగా ఈ ప్రాంతాల నుంచే ఉంటున్నాయి. గతంలో వివిధ ప్రాంతాల్లో ఉండే నైజీరియన్లు నేరుగా హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ విక్రయించేవారు. వీరిపై నిఘా పెరగడం, పట్టుబడితే సొంత దేశాలకు తిరిగి పంపిస్తున్నారనే చర్యలతో నైజీరియన్లు ఇక్కడికి వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో మత్తు పదార్థాలకు విపరీతంగా అలవాటుపడ్డ వారు నేరుగా నైజీరియన్లతో సంబంధాలు పెంచుకుంటున్నారు.
మత్తు పదార్థాలు : అవసరమున్నప్పుడు గోవా, బెంగళూరు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు బస్సులు, రైళ్లలో గుట్టుగా నగరానికి తీసుకొస్తున్నారు. శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు మాదాపూర్‌లో రూ.7 కోట్ల విలువైన కిలో హెరాయిన్ పట్టుకున్నారు. రాజస్థాన్ నుంచి చిన్న మొత్తాల్లో మరింత సరకు వస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు ముంబయి, చెన్నై నుంచి కొత్త వ్యక్తుల ద్వారా ఇక్కడికి మత్తు పదార్థాలు వస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో వెలుగుచూస్తోంది.
ఆన్లైన్లో మీ సమాచారం సేఫ్‌గా ఉండాలా? - తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచనలు ఇవే