Telangana Govt Decision on Rythu Runa mafi :ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో.. అధికారంలోకి రాగానే రెండిటిని నెరవేర్చింది. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు. ఇప్పుడు మూడో హామీని కూడా నెరవేర్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. అదే.. అన్నదాతలకు రుణమాఫీ. ఈ మేరకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
2 లక్షల రుణమాఫీ..
అన్నదాతలకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను పట్టించుకోవట్లేదని, ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ ప్రకటన చేశారని విపక్షాలు ఆరోపిస్తున్న వేళ.. రేవంత్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా.. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీపై మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల మేర రైతు రుణం మాఫీ చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు సిద్ధమవుతున్నాయని చెప్పారు.
తాజాగా ధరణి సభ్యుడు..
ఆర్థిక మంత్రి ప్రకటన తర్వాత.. రైతు రుణమాఫీపై తాజాగా ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి సైతం స్పందించారు. రైతు రుణమాఫీకోసం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇందులో భాగంగా.. బ్యాంకుల వారీగా రైతుల అప్పుల వివరాలు సేకరిస్తోందని అన్నారు. పూర్తి సమాచారం అందగానే.. రుణమాఫీ అమలవుతుందని స్పష్టం చేశారు.
రుణమాఫీ అమలు ఇలా..!
రుణమాఫీ ఎలా అమలు చేయాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో అన్నదాతలు తీసుకున్న మొత్తం పంట రుణాలు దాదాపుగా రూ.20 వేల కోట్ల నుంచి.. రూ.25 వేల కోట్ల వరకు ఉండొచ్చని సర్కారు అంచనా వేసినట్టు సమాచారం. రుణమాఫీని విడతల వారీగా కాకుండా.. ఏకమొత్తంలో మాఫీ చేస్తామని అన్నదాతలకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఆ మొత్తాన్నీ ఒకేసారి మాఫీ చేసి.. ఆ తర్వాత బ్యాంకులకు విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. తద్వారా.. రాష్ట్ర ఖజానాపై భారం పడకుండా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం.
రూ.3 లక్షల మేర రుణం?
రైతు రుణమాఫీ తర్వాత అన్నదాతలకు రుణం ఇచ్చే విషయంలోనూ మరింత ఉదారంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. రైతుల రుణ చరిత్ర ఆధారంగా రూ. 3 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు అందించేందుకూ చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్నదాతలు చెల్లిస్తున్న పావలా వడ్డీని సైతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ.. రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు చూస్తున్నట్టు సమాచారం. సాధ్యమైనంత త్వరలో ఈ నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్న తెలుస్తోంది.