Woman Suspicious Death in Hyderabad : హైదరాబాద్ రామంతాపూర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సూర్యాపేట జిల్లా పోలుమళ్లకు చెందిన మనీషా అదే జిల్లా వెంపటికి చెందిన సంపత్ అనే యువకుడు గతేడాది పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం రామంతాపూర్ వచ్చి అద్దెకు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తమ కుమార్తె మృతి చెందిందంటూ ఫోన్ రావడంతో ఆమె తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. ఘటనా స్థలానికి చేరుకొని, కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన యువతి మృతదేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా తమ కుమార్తెను వరకట్నం కోసం సంపత్ సహా అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఆమె మృతికి వేధింపులే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
నా చావుకు ఆమె తండ్రే కారణం - ఆత్మహత్య చేసుకునే ముందు ఓ యువకుడి లెటర్ కలకలం