25 Crore Buffalo In Maharashtra : మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో జరిగిన 'ఆగ్రికల్చర్ ఎక్స్పో'లో ఓ దున్నపోతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాలుగేళ్ల వయసున్న ఈ దున్నపోతు 1,500 కిలోల బరువు, 14 అడుగుల పొడవు ఉంది. దీంతో ప్రదర్శనకు వచ్చిన వారంతా దీనిని ఆసక్తిగా తిలకించారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దున్నపోతు
కొల్హాపుర్‌లోని మెర్రీ వెదర్ గ్రౌండ్‌లో రాజ్యసభ ఎంపీ ధనుంజయ్ మహాదిక్ గత 17 ఏళ్లుగా వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేసిన విత్తనాలు, పశువులు, పెంపుడు జంతువులను ఈ ప్రదర్శన తీసుకొస్తారు. తాజాగా హరియాణాలోని పానీపత్‌కు చెందిన నరేంద్ర సింగ్ అనే వ్యక్తి తీసుకొచ్చిన దున్నపోతు ఈ వ్యవసాయ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దున్నపోతు పోషణకు నెలకు రూ.1లక్ష ఖర్చు
ఈ దున్నపోతును ఏసీ ఉన్న వాహనంలోనే బయట ప్రదేశాలకు తీసుకెళ్తుంటారని నరేంద్ర సింగ్ తెలిపారు. 'ముర్రా జాతికి చెందిన ఈ దున్న పోషణకు నెలకు రూ.1లక్ష వరకు ఖర్చవుతుంది. 14 అడుగుల పొడవు ఉన్న ఈ 'ఆమ్‌దార్' ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన దున్నపోతు. దేశవ్యాప్తంగా జరిగే వివిధ వ్యవసాయ ప్రదర్శనలలో ఈ ఆమ్‌దార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటి వరకు 7 వ్యవసాయ ప్రదర్శనలో ఛాంపియన్‌గా నిలిచింది' అని నరేంద్ర చెప్పారు.
భారీగా దాణా
దున్నపోతు నిర్వహణకు ప్రతిరోజు ఇద్దరు ఉంటారు. ఒకరు దున్నకు బాడీ మసాజ్ చేస్తారు. మరొకరు మేత, దాని నిర్వహణ చూసుకుంటారు. ఆమ్ దార్ రోజుకు 20 లీటర్ల పాలు గటగటా తాగేస్తుంది. అలాగే 20 కిలోల దాణా తింటుంది. 30 కిలోల పశుగ్రాసం, పొట్టు లాగించేస్తోంది. ఈ దున్నపోతును రోజుకు 3సార్లు కడుగుతారు. ఏసీ రూమ్‌లో ఉంచుతారు.
ఈ దున్నపోతు యజమాని నరేంద్ర సింగ్‌కు 2017లో పద్మశ్రీ అవార్డు దక్కింది. ఈయన దగ్గర యువరాజ్, సుల్తాన్, గోలు-2 అనే ముర్రా జాతి దున్నపోతులు ఉన్నాయి. ఇప్పుడు ఆమ్దార్ను కూడా పెంచుతున్నారు. ఈ దున్నపోతు వీర్యానికి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. కొల్హాపుర్‌లో వ్యవసాయ ప్రదర్శనకు వచ్చిన ఈ దున్నపోతును చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.