Adiyogi Statue in Dwarapudi : భక్తులు పరమేశ్వరుడిని ఎంతలా ఆరాధిస్తారో అందరికీ తెలిసిందే. కోరిన కోర్కెలు తీర్చే భోళా శంకరుడిని ఎంతో నిష్ఠతో పూజిస్తారు. ఇక, మహాశివరాత్రి వస్తోందంటే భక్తుల కోలాహలం మామూలుగా ఉండదు. శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతుంటాయి. మహాశివుడి దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తుంటారు. సరిగ్గా ఆ పర్వదినాన ఆంధ్రప్రదేశ్లో పరమేశ్వరుడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలం, ద్వారపూడిలో శివయ్య భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. "ఆంధ్ర శబరిమల"గా ప్రసిద్ధిగాంచిన అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహం కోలువు దీర్చారు. ఈ శివరాత్రి రోజున ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు.
దేశంలోనే మూడో విగ్రహం :
దేశంలో ఆదియోగి ఆకార భారీ విగ్రహాలు కర్ణాటకలోని బెంగళూరులో, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఉన్నాయి. వీటి ఎత్తు 112 అడుగులు. ఆంధ్రప్రదేశ్లోని ద్వారపూడిలో 60 అడుగుల ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేశారు. దీని వెడల్పు 100 అడుగులు. దేశంలోని మూడో అతిపెద్ద విగ్రహం ఇదే. మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26న ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ విగ్రహానికి మరో ప్రత్యేకత ఏమంటే, విగ్రహం వెనుక భాగం నుంచి లోపలకు ప్రవేశమార్గం ఉంది. ఇందులో శివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు, అక్కడ ధ్యానం చేసుకునే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
మరికొన్ని విగ్రహాలు :
ఆదియోగి రూపంలోని మహాశివుడి విగ్రహానికి ఎదురుగా మరికొందరు దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు శివయ్యకు నమస్కరిస్తున్నట్టుగా నిర్మించారు. ఇక ఆదియోగి విగ్రహానికి నలువైపులా వశిష్ఠ మహర్షి, గౌతమ మహర్షి, అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, కశ్యప బ్రహ్మరుషి, జమదగ్ని మహర్షి, వాల్మీకి, విశ్వామిత్ర మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇవి ధ్యానం చేస్తున్న ఆకారంలో ఉన్నాయి. ఆ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే అర్ధనారీశ్వర విగ్రహం, కుమారస్వామి, వినాయకుడు, కృష్ణార్జునులు, నటరాజ, నంది, అనంత పద్మనాభస్వామి విగ్రహాలు ఉన్నాయి.
ఆ స్పూర్తితోనే :
కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు మన దగ్గర కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందని ద్వారపూడి అయ్యప్ప ఆలయ వ్యవస్థాపకుడు ఎస్. ఎల్.కనకరాజు గురుస్వామి చెప్పారు. అనుకున్నదే తడవుగా పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామానికి చెందిన శిల్పి వీరరాఘవను సంప్రదించి, విగ్రహానికి అంకురార్పణ చేసినట్టు చెప్పారు. దాతల సహకారంతో దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేసి విగ్రహం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
తొమ్మిది మాసాల్లో :
ఆదియోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తొమ్మిది నెలల సమయం పట్టిందని శిల్పి కొల్లి వీరరాఘవ తెలిపారు. ఈ విగ్రహం కోసం 5 టన్నుల ఇనుము, 1200 బస్తాల సిమెంటు, 7 లారీల ఇసుక, 25 వేల ఇటుకలు, 2 లారీల కంకర ఉపయోగించినట్టు తెలిపారు. సిమెంటులో నల్ల రంగు మెటీరియల్ కలిపామని, అందువల్ల దాదాపు 15 ఏళ్లపాటు విగ్రహం రంగు మారదని అన్నారు. పగుళ్లు అవచ్చే అవకాశం కూడాలేదని చెప్పారు.
మరి, ఈ శివరాత్రికి మీరు శివయ్య సన్నిధిలో ఉండాలని అనుకుంటే తప్పకుండా ద్వారపూడి వెళ్లండి. కచ్చితంగా తన్మయత్వం చెందుతారు.
ఇవి కూడా చదవండి :
భూమ్మీద శివుడు నాట్యం చేసిన 5 ప్రాంతాలివే - మనకు సమీపంలోనే ఉన్నాయి!