Golden Gopuram Unveiled at Yadagirigutta Temple : శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 11:36 గంటలకు మూల నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహూర్తాన సీఎం రేవంత్ రెడ్డి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు. దీంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన స్వర్ణ గోపురం స్వర్ణ మయంగా మారింది. మహత్తర ఘట్టంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నివాసం నుంచి రోడ్డు మార్గన రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్టకు చేరుకున్నారు.
ఆలయ ఈవో, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. మొదటగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకుని మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆలయ విమాన గోపురంపైకి చేరుకుని బంగారు విమాన గోపురాన్ని ఆవిష్కరించారు. వానమామలై పీఠాధిపతి మధుర కవి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం ఘట్టం నిర్వహించి, బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేశారు. బంగారంతో మెరిసిపోతున్న యాదగిరిగుట్ట స్వర్ణ దివ్య విమాన గోపురం మహోజ్జ్వలంగా, దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చింది.
స్వర్ణతాపడం కోసం రూ.80 కోట్లు ఖర్చు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం స్వర్ణ విమాన గోపురం 50.5 అడుగులఎత్తులో, సుమారు 10,759 వేల ఎస్‌ఎఫ్‌టీలు ఉంది. దేశంలోనే అతి ఎత్తయిన ఏకైక స్వర్ణ విమాన గోపురంగా రికార్డు సృష్టించింది. రూ.80 కోట్లు నిధులతో 68 కిలోల బంగారంతో స్వర్ణతాపడం చేశారు. స్వర్ణ విమాన గోపురం కోసం భక్తులు, దాతలు నుంచి విరాళాలు సేకరించారు. విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. బంగారు విమాన దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పట్లు చేశారు. స్వర్ణ దివ్య విమాన గోపురం ఆవిష్కరణ ఘట్టంతో యాదగిరిగుట్ట ఆలయ పరిసర ప్రాంతాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయింది.
స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీఎస్ శాంతకుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.