RBI Released Report on Pulses Cultivation :రైతే రాజుగా ఉన్న ఈ దేశంలో పప్పులు పండించే కర్షకులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. పప్పు దినుసుల నిల్వకు తగిన వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ మేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) నివేదకను విడుదల చేసింది. ఈ నివేదికలో పలు వివరాలను వెల్లడించింది. పప్పు దినుసుల సాగులో స్వయం సమృద్ధి సాధించేందుకు అవకాశాలున్నా, ప్రభుత్వం అందుకు తగ్గట్లు కృషి చేయడం లేదని, ఇంకా దిగుమతుల మీదనే ఆధారపడుతున్నట్లు తెలిపింది. దేశంలో ప్రధానమైన పప్పు దినుసులైన పెసర, శనగ, కందులపై ఆర్బీఐ అధ్యయన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచంలోనే పప్పు దినుసుల సాగులో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా పప్పు దినుసుల్లో ఇండియా 28 శాతం ఉత్పత్తి చేస్తోంది. అయినా 2022లో అవసరాల మేరకు 2.5 మిలియన్ టన్నులను ఇండియా దిగుమతి చేసుకుంది. దేశీయ ఉత్పత్తుల కంటే 9 శాతం ఎక్కువ. పప్పుల సాగు విస్తీర్ణంలో దేశంలోని మొత్తం 49.5 శాతం శనగలే. ఆ తర్వాత 14.1% కందులు. రాష్ట్రంలో రైతులు పండించే పప్పు దినుసుల్లో ప్రధానమైంది కంది. కంది కొనుగోలు ద్వారా వచ్చే ప్రతి రూపాయిలో రైతులకు 65 పైసలు, పెసర ద్వారా 70 పైసలు, శనగలకు 75 పైసలు లభిస్తోంది.
పప్పుల క్రయవిక్రయాలు కొన్ని మార్కెట్లలోనే: పప్పు దినుసులను సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పండిస్తున్నారు. పప్పుల క్రయవిక్రయాలు కొన్ని మార్కెట్లలోనే ఉన్నాయి. దీంతో రైతులు అక్కడికి సరుకులను తీసుకుని వెళ్తున్నారు. దీని వల్ల రవాణాకు భారీగా ఖర్చవుతోంది. మార్కెట్లలో రుసుములు, ఇతర ఖర్చులు సైతం వారే భరిస్తున్నారు. ధర విషయంలో అక్కడి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, టోకు, చిల్లర వర్తకులు, మిల్లర్ల మీదనే వారు ఆధారపడుతున్నారు. మద్దతు ధరల విధానం ఉన్నా, వ్యాపారుల నుంచి అది లభించడం గగనంగా మారింది.