ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పింఛన్లపై వైసీపీ సర్కార్​ మరో కుట్ర - లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యం - PENSION DISTRIBUTION ISSUE IN AP - PENSION DISTRIBUTION ISSUE IN AP

Pension Distribution Issue in Andhra Pradesh: ఇంటింటికీ పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న రీతిలో ఉంది. లబ్ధిదారులందరికీ ఇంటింటికీ వెళ్లి పంపణీకి కుదరదంటోంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసినా, రెండు రోజుల్లోనే పంపిణీ పూర్తవడంతో అనుకున్న లక్ష్యం నెరవేరక దాన్ని పక్కనపెట్టింది. ఈసారి మరింత కష్టపెట్టే వ్యూహాన్ని రచించింది. అందుకే మొదట ఏ బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డు అనుసంధానమైందో తెలుసుకునేందుకు సచివాలయానికి వెళ్లి, ఆ తర్వాత దూరాన్న ఉండే బ్యాంకుకు వెళ్లి జనం ఇక్కట్లు పడేలా నిర్ణయం తీసుకుంది.

ysrcp plan
ysrcp plan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 7:14 AM IST

Updated : Apr 30, 2024, 9:03 AM IST

పింఛన్లపై వైసీపీ సర్కార్​ మరో కుట్ర - లబ్ధిదారుల్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యం

Pension Distribution Issue in Andhra Pradesh: రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్య 15 వేల 4. వాటిలో లక్షా 35 వేలమంది సిబ్బంది ఉన్నారు. వారి ద్వారా ఇంటింటికీ పింఛన్లు పంపిణీ ఎంతో సులభం. కానీ సీఎస్‌, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అలా చేయడానికి సమ్మతించడం లేదు. కనీసం పింఛనుదారుల ఇంటికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండే సచివాలయానికి వెళ్లి పింఛను తీసుకోవడం సులభం. కానీ ప్రభుత్వం మాత్రం 5 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండే బ్యాంకుకు వెళ్లమంటోంది. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయొచ్చని విపక్షాలు తేల్చిచెబుతున్నా, ధర్నాలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా సర్కారు చెవికెక్కలేదు. బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తామంటూ మరింత క్లిష్టమైన పరిస్థితి తెచ్చి పెట్టింది.

తొలిరోజు పింఛను అందనట్టే: మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ రోజు మేడే సెలవు అయినందున తొలిరోజు పింఛను అందనట్టే. సెలవు తర్వాత రోజు బ్యాంకుల్లో రద్దీ ఉంటుంది. చాలా గ్రామాలకు బ్యాంకులు అందుబాటులో లేవు. సరిపడా సిబ్బంది ఉండరు. పైగా రోజువారీ పనులు ఉంటాయి. సర్వర్‌ సమస్యలూ తప్పవు. నగదు జమ, విత్‌డ్రాకు సంబంధించిన వ్యవహారాలు చూసేది ఒక్కరే. కొన్ని పెద్ద బ్రాంచీల్లోనే ఇద్దరు ఉంటారు.

పైగా పింఛను డబ్బులు ఇవ్వడానికి వారు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. ఇతర రెగ్యులర్‌ కస్టమర్ల బిజినెస్‌ వ్యవహారాలు చూసుకుంటూ పెన్షనర్లకూ సొమ్ము పంపిణీ చేయాలి. బ్యాంకు సిబ్బందికీ తలకు మించిన భారమే. ఈ లెక్కన పింఛన్లు పంపిణీకి కనీసం వారం రోజులు పైనే పడుతుంది. ఈ జాప్యానికి కారణం విపక్షాలే అని చూపించడానికి మరోసారి ఆస్కారం ఇవ్వడమే ఈ కుట్ర వెనుక దాగివున్న అసలు ఉద్దేశంలాగా కనిపిస్తోంది.

వైఎస్సార్సీపీకి వంత పాడేలా జవహర్‌రెడ్డి జగన్నాటకం - బ్యాంకుల్లో పింఛను నగదు జమ చేసేలా నిర్ణయం - CS Jawahar Reddy Plan on Pensions

పోలింగ్‌ తేదీ వరకు పంపిణీ కొనసాగించే ఉద్దేశమేనా: రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల 60 బ్యాంకు బ్రాంచీలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 65.49 లక్షల మంది పెన్షనర్లు ఉంటే వారిలో పట్టణాలు, నగరాల్లో ఉండేది 12.17 లక్షల మందే. ఇక 52.89 లక్షల మంది ఉండేది గ్రామీణ ప్రాంతాల్లోనే. సగటున ఒక్కో బ్యాంకు బ్రాంచ్‌కి పట్టణ ప్రాంతాల్లో 429 మంది పింఛనుదారులు, గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి 12 మంది పింఛనుదారులు వస్తారు.

ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే 16.57 లక్షల మందికి మినహాయించినా ఒక్కో బ్యాంకు వద్దకు వెళ్లాల్సిన వారి సంఖ్య సగటున పట్టణాలు, గ్రామాల్లో 350 నుంచి 900 వరకు ఉంటుందని అంచనా. ఇతర లావాదేవీలు చూసుకుంటూ సగటున రోజుకు 50 నుంచి 70 మందికి మించి పంపిణీ జరిగే అవకాశం లేదు. అంటే పింఛనుదారుల్ని ఎలాగైనా మండుటెండల్లో ఇబ్బంది పెట్టి పోలింగ్‌ తేదీ వరకు పంపిణీ కొనసాగించే ఉద్దేశమేనన్న వాదన వినిపిస్తోంది.

పింఛన్ల పంపిణీలో దిద్దుబాటు చర్యలు ఏవి? - ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా? - Pension Distribution in AP

12 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే: నెల్లూరు జిల్లాలో కందుకూరు మండలం పాలూరు దొండపాడు పంచాయితీకి చెందిన 392 మంది పింఛనుదారులు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే కందుకూరుకు వెళ్లాలి. ఈ గ్రామానికి బస్‌ సౌకర్యం లేదు. నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు మండలం భైరవరం సచివాలయ పరిధిలో 534 మంది పింఛనుదారులున్నారు. వీరు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుత్తలూరు వెళ్లి పింఛను తీసుకోవాలి. బస్‌ సౌకర్యమూ లేదు. ప్రైవేటు లేదా సొంత వాహనాల మీద ఆధారపడాలి.

చిత్తూరు జిల్లా గుడిపల్లె మండలం ఇరిసిగానిపల్లె గ్రామానికి చెందిన పెన్షనర్లు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే కుప్పం పట్టణానికి వెళ్లాలి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు శివారు వీరవల్లి మోకాస గ్రామానికి చెందిన పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లి పింఛను తీసుకోవాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణించాలి. తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన పింఛనుదారులు 5 కిలోమీటర్ల దూరంలోని ధర్మవరం గ్రామానికి వెళ్లి పింఛను తీసుకోవాలి. వైఎస్సార్‌ జిల్లా ముద్దనూరు మండలంలోని మంగపట్నం గ్రామానికి చెందిన పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లాలంటే 20 కిలోమీటర్లు ప్రయాణించాలి.

కొండలు, గుట్టల నడుమ ప్రయాణించాలి: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 33 గిరిజన గ్రామాలు ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడి పింఛనుదారులు బ్యాంకుకు వెళ్లాలంటే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కొంతదూరం కాలినడకన వెళ్లి తర్వాత ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాలి. రవాణా, ఇతరత్రా ఖర్చు కలిపి దాదాపుగా ఒక్కొక్కరికీ 400 రూపాయలు అవుతుంది. ఇలా కొండలు, గుట్టల నడుమ కనీసం రహదారి లేని గిరిజన గ్రామాలు రాష్ట్రంలో కోకొల్లలు. వాటికి సుదూరంలో బ్యాంకులు ఉంటాయి.

జగన్‌ పాలన కొనసాగితే బతికుండగా బకాయిలు అందుకోగలమా?: విశ్రాంత ఉద్యోగులు - Senior Citizens Facing Problems ap

35 కిలోమీటర్లు దూరం: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో మూడు బ్యాంకులు ఉన్నాయి. రెండు కొమరాడలో, ఒకటి కూనేరులో ఉంది. ఈ మండలంలో 8 వేల 619 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరిలో ఆరు వేల మందికి పైగా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తే 31 పంచాయతీలు 99 రెవెన్యూ గ్రామాల నుంచి వారంతా మూడు బ్యాంకులకు రావాలి. శివారున ఉన్న కుంతేశు గ్రామం నుంచి బ్యాంకుకు రావాలంటే వారు 35 కిలోమీటర్లు దూరం ప్రయాణించాలి.

సరైన రహదారి సౌకర్యమూ లేదు: విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామానికి చెందిన పింఛనుదారులు పదిహేను కిలోమీటర్ల దూరంలోని మెంటాడకు వెళ్లి పింఛను తీసుకోవాలి. 5 నుంచి 30 కిలోమీటర్ల దూరం వ్యయ ప్రయాసలకోర్చి బ్యాంకులకు చేరుకుని అక్కడ పడిగాపులు కాయడం పింఛనుదారులకూ ఇబ్బందికరమే. చాలా గ్రామాలకు సరైన రహదారి సౌకర్యమూ లేదు. వారందరూ కాలినడకను ఆశ్రయించాల్సిందే.

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. వెళ్లినరోజే పింఛను సొమ్ము ఇవ్వకపోతే మర్నాడు మళ్లీ వెళ్లాలి. ఇది ఎంత ఇబ్బందికరం! ఇంటింటికీ ఇవ్వాలనేది పింఛనుదారుల ప్రధాన డిమాండ్‌. అలా పంపిణీ చేసేందుకు అంతగా ఇబ్బందులుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇవ్వొచ్చు కదా? ఇలా ఊరు దాటి ఊర్లో ఉండే బ్యాంకులకు తిప్పడం ఏంటి? కనీసం ఏప్రిల్‌ 1న గ్రామ, వార్డు సచివాలయాల్లో రెండు రోజుల్లోనే 90 శాతం పంపిణీ చేశారు కదా? పోలింగ్‌కు 13 రోజుల సమయం ఉండగా పింఛనుదారుల్ని బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా చేయడం కుట్ర కాక మరేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పెన్షన్ల పంపిణీతో వృద్ధుల ప్రాణాలు తీసేందుకు మరోసారి సీఎస్ సిద్ధమయ్యారు: టీడీపీ నేతలు - TDP Leaders Fired on CS

Last Updated : Apr 30, 2024, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details