Break Darshan Cancelled Due To Koil Alwar Thirumanjanam at TTD : శ్రీవారి ఆలయంలో 2025 జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దీంతో ఆ రోజు బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని తెలిపింది. ముందురోజు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీడీడీ పేర్కొంది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో జనవరి 7న ఆలయ శుద్ధి, ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులను నేరుగా సర్వదర్శనానికి అనుమతించనున్నారు.
అయితే తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు రోజుకు దాదాపు 70 వేలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా టీటీడీ చర్యలు చేపట్టింది. దర్శన టికెట్లు ఉన్నవారిని మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించి దర్శనాలు కల్పించేలా ప్రణాళిక చేపట్టారు. ఏకాదశి మొదలు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లకు పలు చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకన్న చౌదరి తెలిపారు.
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు - ఆన్లైన్లో టికెట్లు విడుదల
మరో వైపు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. రోజు తిరుమల గోకులం కార్యాలయంలో 800 కోటా టికెట్లను టీటీడీ జారీచేస్తుండటంతో భారీగా క్యూలైన్ పెరుగుతోంది. 10 రోజులుగా మధ్యాహ్నం ఒంటి గంటకే శ్రీవాణి ట్రస్టు టికెట్ల జారీ ప్రక్రియ పూర్తవుతోంది. రూ.10,500కు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను టీటీడీ జారీ చేస్తొంది. సాధారణంగా ఉదయం ఎనిమిదన్నరకు కౌంటరులో టికెట్ల జారీని మొదలు పెడతారు.
వీటి కోసం ఉదయం 6 గంటల నుంచే భక్తులు క్యూలైన్ వద్దకు చేరుకుని పడిగాపులు కాస్తుంటారు. అయితే శ్రీవాణి టికెట్లు కావాల్సిన భక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కౌంటరులోకి వెళ్లి టికెట్లు పొందాల్సి ఉంది. క్యూలైన్లలోకి చంటి పిల్లలను సైతం తీసుకొని వెళ్లాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు విపరీతంగా ఆదరణ పెరిగి ఒంటి గంట తర్వాత టికెట్లు లేకపోవడంతో భక్తులు నిరాశతో వెనుతిరుగుతున్నారు.