Fibernet Chairman GV Reddy on Officials Irregularities : ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ, ఐఎఎస్ అధికారి దినేష్ రెడ్డి పై ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజద్రోహానికి పాల్పడుతున్నారని, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పలువురు ఉన్నతాధికారులతో కలసి ఇప్పటికీ వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే దీవాలా అంచున ఉన్న ఫైబర్ నెట్ సంస్థను చంపేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేసే సంస్కరణలకు ఏమాత్రం సహకారం అందించడం లేదంటూ మరో ముగ్గురు ఉన్నతాధికారులను తక్షణం తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దినేష్ అవినీతి అక్రమాలపై సీఐడీ లేదా విజిలెన్స్ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు.
వైఎస్సార్సీపీ హయాంలో దివాలా అంచుకు చేర్చిన ఏపీ ఫైబర్ నెట్‌ను తిరిగి పూర్వవైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు చేస్తోంది. మంత్రి జనార్థన్ రెడ్డి సహా ఛైర్మన్ జీవీ రెడ్డి ఇప్పటికే ప్రక్షాళన చేస్తూ సంస్కరణలు కొనసాగిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అక్రమంగా నిబంధనలకు విరుద్దంగా నియమించిన ఇప్పటికే 610 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ఆ సంస్థ ఛైర్మన్ జీవీ రెడ్డి ఇవాల సంస్థలో కీలకమైన మరో ముగ్గురు ఉన్నతాధికారులపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి 9నెలలు గడిచినా ఫైబర్ నెట్ లో ఇంకా వైసీపీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఏపీ ఫైబర్ నెట్ సంస్థలోని ముగ్గురు ఉన్నతాధికారులను తక్షణం తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
'RGV సినిమా ఒక్కసారి చూస్తే రూ.11వేలు' - నోటీసులు పంపిన APSFL
ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పప్పు సత్యరామ్ భరద్వాజ్, సంస్థ బిజీనెస్ హెడ్ గంధం శెట్టి సురేష్, ప్రొక్యూర్ మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్ ను తక్షణం విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. సంస్థలో తాను 610 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశాలిచ్చాయినా అధికారులు ఇప్పటి వరకూ ఆదేశాలివ్వలేదని మండిపడ్డారు. ఉద్యోగుల తొలగింపు ఆదేశాలపై ఫైబర్ నెట్ ఎండీ, ఈడీలు సంతకాలు చేయకపోగా ఉద్యోగులకు నెలనెలా జీతాలు రూపంలో సంస్థ సొమ్మును చెల్లించారని, వైఎస్సార్సీపీ వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఫైబర్ నెట్ ఎండీగా దినేష్ కుమార్ గతేడాది ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నా ఒక్కరోజైనా సమీక్షించలేదని, కనెక్షన్ల కోసం కలిసేందుకు ఒక్క కేబుల్ ఆపరేటర్‌నూ ఎండీ దినేష్ కుమార్ కలవడం లేదన్నారు. ఫైబర్ నెట్‌ను చంపేసే కుట్ర చేస్తున్నారన్న జీవీ రెడ్డి ఈ ప్రభుత్వం పై జరుగుతోన్న కుట్ర అనుకోవాలా అని ప్రశ్నించారు. ఫైబర్ నెట్ సంస్థను చంపేయాలని ఎండీ దినేష్ కుమార్ భావిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఉన్నట్లే ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పనిచేస్తున్నారని ఆక్షేపించారు. దినేష్ కుమార్ కనీసం టార్గెట్లు పెట్టడం లేదు. ఆదాయం పెంచేందుకు కనీసం ప్రయత్నం చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంతో ఏపీ ఫైబర్ నెట్ లోని ఉన్నతాధికారులు, అధికారులు చేతులు కలిపారా అని అనుమానాలున్నాయని తెలిపారు.
తక్కువ ధరకే నాణ్యమైన ఇంటర్నెట్, కేబుల్ నెట్వర్క్- 50 లక్షల కనెక్షన్ల టార్గెట్ : జీవీ రెడ్డి
జనవరి 23న ఫైబర్ నెట్ సంస్థపై జీఎస్టీ అధికారులు రూ. 377 కోట్లు జరిమానా విధించినా మా అధికారులు తనకు కనీస సమారం ఇవ్వలేదని జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిసేసిన 610మంది సిబ్బందికి అక్రమంగా మూడు నెలల పాటు కోట్ల రూపాయల జీతాలు చెల్లించారని మండిపడ్డారు. చెల్లించిన మొత్తాన్ని తొలగించిన ఎండీ దినేష్, ఉన్నతాధికారుల నుంచే రికవరీ చేయాలని తాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. రికవరీ చేసేందుకు చర్యలు తీసుకోవడం సహా విజిలెన్స్ లేదా సీఐడీ విచారణ కు ఆదేశించాలని అడ్వకేట్ జనరల్, సీఎస్‌కు లేఖ రాస్తాన్నారు.
గతేడాది 31 అక్టోబర్ నాటికే ఇన్‌కం ట్యాక్స్ చెల్లించాల్సి ఉండగా జాప్యం చేశారని, నేను కనుక్కుని తక్షణం చెల్లింపులు చేసి సంస్థ సొమ్ము రూ.30 కోట్లను మిగిల్చానన్నారు. ఫైబర్ నెట్ సంస్థలో ఎండీ దినేష్ సహా అధికారులు అవినీతితో పాటు అక్రమాలు చేస్తూ రాజద్రోహం ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2019-24 మద్య వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణకు అధికారులు వస్తే ఒక్కరూ సహకరించలేదని దుయ్యబట్టారు. విజిలెన్స్ సహకరించాలని తాను చైర్మన్ హోదాలో లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు.
అధికారులకు చెల్లించిన మొత్తం డబ్బును రికవరీ చేయాలని అడ్వకేట్ జనరల్, సీఎస్‌కు లేఖ రాస్తా. ఆదాయపన్ను చెల్లింపులోనూ జాప్యం చేశారు. నేను విషయం కనుక్కుని రూ.30 కోట్లు ఆదా చేశాను. ఫైబర్‌నెట్ అధికారులు అవినీతి, ద్రోహం చేస్తున్నారు. 2019-24 మధ్య అక్రమాలపై విజిలెన్స్ విచారణకు సహకరించలేదు. విచారణ జరిపి సొమ్ము రికవరీ చేయాలని సీఎస్‌కు లేఖ రాస్తున్నాను. ఉన్నతాధికారులు రాజద్రోహం చేస్తున్నారు. క్షమించరాని నేరం చేశారు.- జీవీ రెడ్డి, ఫైబర్‌నెట్ ఛైర్మన్