Mahashivratri Festival Ritual 2025 : శివభక్తులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినం వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈనెల 26వ తేదీన అత్యంత వైభవంగా శివరాత్రి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున కొన్ని ద్రవ్యాలతో శివుడిని అభిషేకించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
అనారోగ్య సమస్యలు తగ్గడానికి :
అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవు పెరుగుతో శివాభిషేకం చేయాలి. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయట! అభిషేకం చేసే సమయంలో మూడు నామాలు తప్పకుండా చదువుకోవాలి. 'బాలాంబికేశ! వైద్యేశ! భవరోగ హరేతిచ!' అని స్మరించుకోవాలి. శివుడికి ఆవుపాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి.
సొంతింటి కల నెరవేరడం కోసం!
చాలా మందికి సొంతింట్లో ఉండాలని ఎన్నో ఏళ్ల నుంచి కోరిక ఉంటుంది. అయితే మహా శివరాత్రి సందర్భంగా ఇళ్లు, లేదా అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకునే వారు, కొన్ని నీళ్లలో పూలు ఉంచి, ఆ పుష్ప జలంతో శివుడికి అభిషేకం చేయండి. అలాగే నవరత్న జలాలతో అభిషేకం చేస్తే గృహయోగం త్వరగా కలుగుతుంది. ఇలా చేస్తే సొంతింటి కల నేరవేరుతుందని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

పుత్ర సంతానం కలగాలంటే ?
"కొంతమంది దంపతులు సంతాన లేమి సమస్యతో బాధపడుతుంటారు. వీరు గంధం కలిపిన నీళ్లతో శివరాత్రి రోజున శివాభిషేకం చేయాలి. ఇలా చేస్తే త్వరలోనే పుత్ర సంతానం కలుగుతుంది.
- తేనెతో శివాభిషేకం చేస్తే కళా రంగంలో అద్భుతంగా రాణించవచ్చు. సంగీత నాట్య రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే తేజస్సు కూడా కలుగుతుంది.
- ఆవు నెయ్యితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది.
- పంచదార కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అన్ని కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు.
- శివుడికి చెరకు రసంతో అభిషేకం చేస్తే ధనవృద్ధి కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.
- రుద్రాక్షలు కొన్ని నీళ్లలో వేసి శివరాత్రి రోజు ఆ జలంతో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
- విభూతి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి.
- మారేడు దళాలు కొన్ని నీళ్లలో కలిపి ఆ జలంతో శివాభిషేకం చేస్తే భోగ భాగ్యాలు కలుగుతాయి.
- ఒకప్పుడు మీకు బాగా డబ్బులు, బంగారం, ఇళ్లు, స్థలాలు అన్ని ఉండి కొన్ని కారణాల వల్ల సంపదలన్నీ పోగొట్టుకుంటే, గరికపోచలు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయండి. ఇలా చేస్తే మీ ఆస్తులు మొత్తం తిరిగి వస్తాయి.
- శివరాత్రి రోజు అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి కలుగుతుంది.
- చక్రవర్తిత్వం కలగాలంటే కస్తూరి నీళ్లలో కలిపి, ఆ జలంతో అభిషేకం చేయాలి. చక్రవర్తిత్వం అంటే రాజకీయాల్లో ఉన్నవారు నెంబర్ వన్ మినిస్టర్ అవ్వడం వంటిది.
- శివుడిలో ఐక్యం అయిపోవాలి, మోక్షం కావాలనుకునేవారు నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి.
- కార్యసిద్ధి లభించాలంటే ద్రాక్ష పండ్ల రసంతో శివాభిషేకం చేయాలి.
- శత్రు బాధలు తొలగిపోవడానికి ఖర్జూర పండ్ల రసంతో శివాభిషేకం చేయండి.
- కొందరికి అకారణంగా అవమానాలు, నిందలు ఎదురవుతుంటాయి. జాతక చక్రంలో అవయోగాలు, దోషాలు ఉండడంతో ఈ పరిస్థితి వస్తుంది. వీరు బొప్పాయి పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది.
- మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే వారు వెన్నతో అభిషేకం చేయండి.
- అప్పులు బాధ తీరడానికి బియ్యం పిండి కలిపిన నీళ్లతో శివాభిషేకం చేయాలి.
- కుంకుమ పువ్వు కలిపిన నీళ్లతో శివాభిషేకం చేస్తే అద్భుతమైన సౌందర్యం సిద్ధిస్తుంది. అలాగే అదృష్టం వరిస్తుంది.
- అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోవడానికి శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
- మామిడి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
- ఇలా మహా శివరాత్రి సందర్భంగా ఒక్కొక్క ద్రవ్యంతో శివుడికి అభిషేకం చేయడం వల్ల ఒక్కొ ఫలితం కలుగుతుంది" అని కిరణ్ కుమార్ చెబుతున్నారు.
ముఖ్య గమనిక : శివరాత్రి, సొంతింటి కల గురించి పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
మీరు ఎప్పుడైనా గమనించారా! - శివుడి తలపై చంద్రుడు ఎందుకు ఉంటాడో తెలుసా?