IVF Test for Male: వివాహం జరిగి ఏళ్లు గడిచినా సంతానం కలగకపోతే భార్యాభర్తలతో పాటు ఆ కుటుంబం మొత్తం ఆందోళన చెందుతుంది. ఫలితంగా సంతాన సౌఫల్య కేంద్రాలకు క్యూ కడుతూ ఉంటారు. అయితే, సంతానం కలగకపోతే చాలామంది మహిళలను తప్పుబడుతుంటారు. మహిళలోని లోపం వల్లే ఇలా జరుగుతుందని అంటుంటారు. కానీ దీనికి పురుషుల్లో ఉండే కొన్ని లోపాలు కూడా సంతానం కలగకపోవడానికి కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) గుడ్ న్యూస్ చెప్పింది.
ఏఐ సాయంతో రూపకల్పన
IVFతో తెలిసే ఫలితాన్ని ముందే అంచనావేసే ఒక కృత్రిమ మేధ (ఏఐ) సాధనాన్ని ICMR అభివృద్ధి చేసింది. వారిలోని వై క్రోమోజోమ్ మైక్రోడిలీషన్ (వైసీఎండీ) రకాన్ని గుర్తించే పరికరాన్ని తయారు చేసింది. దీని ఆధారంగా వీరికి IVF ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తుందనే విషయం వెల్లడిస్తుంది. ముఖ్యంగా పురుషుల్లో వంధ్యత్వానికి జన్యు కారణం వైసీఎండీయేనని నిపుణులు చెబుతున్నారు.
'ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి వైసీఎండీ సమస్య'
అయితే, సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న జంటల్లో దాదాపు 50 శాతం పురుష భాగస్వామిలో లోపమే కారణమని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా వీరిలో వీర్య కణాల ఉత్పత్తిలో సమస్యలు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. వంధ్యత్వం ఉన్న ప్రతి 10 మంది పురుషుల్లో ఒకరికి వైసీఎండీ సమస్య ఉంటోందని చెబుతున్నారు. ఈ జన్యులోపం వల్ల వృషణాలు సరిపడా వీర్యకణాలను ఉత్పత్తి చేయలేవని.. ఫలితంగా ఇది వంధ్యత్వానికి దారితీస్తుందని వివరిస్తున్నారు.
ఫర్టిలిటీ ప్రిడిక్టర్ డివైజ్ తయారీ
వైసీఎండీ సమస్య ఉన్న పురుషులు వైద్య చికిత్సతో మెరుగైన ప్రయోజనాన్ని పొందలేరని నిపుణులు చెబుతున్నారు. వీరు ఐవీఎఫ్‌ను ఆశ్రయించాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు నొయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం సాయంతో ఫర్టిలిటీ ప్రిడిక్టర్ అనే ఏఐ ఆధారిత పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఇది వీర్య కణాల పునరుద్ధరణ రేటును అంచనా వేయగలదని వివరిస్తున్నారు. తద్వారా వైసీఎండీ ఉన్న వ్యక్తికి ఐవీఎఫ్ ఎంతమేర ఫలితాన్ని ఇస్తుందన్న విషయం తెలుస్తుందని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మూత్రం ఎక్కువగా వస్తుంటే షుగర్ వచ్చినట్లేనా? తరచూగా మూత్రవిసర్జనకు కారణాలేంటి?
చిటికెడు ఇంగువ పోషకాలు మెండుగా- బీపీ, అజీర్తి, పీరియడ్స్ పెయిన్స్‌కు చెక్!