Ex-Director Of Sand And Mining Venkata Reddy Destroyed Evidence : జగన్ సర్కార్ హయాంలో వైఎస్సార్సీపీ పెద్దలు సాగించిన ఇసుక, గనుల దోపిడీలో అన్నీ తానై వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి.. ఆ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని ధ్వంసం చేశారు. పోస్టుల్లో కొనసాగినంత కాలం వినియోగించిన అధికారిక ల్యాప్‌టాప్ ఏసీబీకి చిక్కకుండా తొలుత దాచేశారు. ఆయనపై కేసు నమోదు చేసి, ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు, తర్వాత అరెస్టు చేసినప్పుడూ దాని ఆచూకీ లభించలేదు. ఏసీబీ అధికారులు పదేపదే ప్రశ్నించినా ల్యాప్‌టాప్ ఎక్కడుందో వెల్లడించలేదు. కొన్నాళ్ల కిందట బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన వెంకటరెడ్డి ల్యాప్‌టాప్‌ను ఏసీబీ అధికారులకు అప్పగించారు.
ఆ ఫోన్లు ఏమయ్యాయి : అందులోని సమాచారాన్ని పూర్తిగా చెరిపేశారు. అప్పట్లో ఆయన వినియోగించిన రెండు ఐ ఫోన్లనూ అప్పగించాలని ఆదేశించగా తన వద్ద లేవని సమాధానమిచ్చారు. తర్వాత ఆ ఫోన్లు ఏమయ్యాయనే దానిపై ఏసీబీ విచారించింది. చివరికి అవి ధ్వంసం చేసినట్లు వెల్లడైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఇసుక విధానం పేరుతో ఏకంగా రూ.2,566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ తన దర్యాప్తులో వెల్లడించింది. ఇదంతా ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి? ఎవరి నుంచి ఎప్పుడెప్పుడు సందేశాలు వచ్చాయి? వాటి సారాంశం ఏంటి? తదితర వివరాలతోపాటు ఇతర కీలక డేటా ఆ ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లలో ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
ఈడీకి ఏపీ కనిపించదా - అధికార పార్టీ ఇసుక దందా ఎన్ని వేలకోట్లో!
వాటిని ధ్వంసం చేయటంతో వెలికితీయటానికి అవకాశం లేకుండా పోయింది. కానీ వాటి రికవరీకి ఏసీబీ ప్రయత్నిస్తోంది. కుంభకోణంలో బడా నేతల వివరాలు బయటకు రాకుండా చేసేందుకే కొంతమంది ఆదేశాలతోనే వీజీ వెంకటరెడ్డి ఈ నేరపూరిత కుట్రకు తెగించినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ వివరాలన్నీ న్యాయస్థానానికి సమర్పించడంతోపాటు వెంకటరెడ్డి సహా ఈ కుట్రలో భాగస్వాములైన ఇతరులపైనా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
'ఏపీ ఇసుక ఫైల్స్' తవ్విన కొద్దీ అక్రమాలు - ఆ ఒక్క సంతకంతో రూ.800 కోట్లు - AP Sand Files