Personal Finance Tax Changes : పర్సనల్ ఫైనాన్స్‌పై విధించే పన్నులకు సంబంధించి ఈసారి కేంద్ర బడ్జెట్‌లో పలు మార్పులు చేశారు. వాటి ప్రభావం పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులపై ఉంటుంది. ఇలాంటి అంశాల్లో చెప్పుకోదగినది 'యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్'(ULIPs). వార్షిక ప్రీమియం రూ.2.50 లక్షలకు మించి ఉండే యులిప్‌ల నుంచి ఎవరైనా అకస్మాత్తుగా వైదొలగాలని భావిస్తే, దానిపై మూలధన లాభాల పన్ను(క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్)ను విధిస్తారు. కనీసం ఏడాదికిపైగా వ్యవధిని పూర్తి చేసుకునే యులిప్‌లను ఈక్విటీ ఆధారిత మూచువల్ ఫండ్లు, షేర్లుగా పరిగణిస్తారు. వాటిపై 12.5 శాతం మేర మూలధన లాభాల పన్నును వేస్తారు.
ఇంతకుముందు వరకు యులిప్ పాలసీని అకస్మాత్తుగా సరెండర్ చేస్తే ఎలాంటి పన్నులూ విధించేవారు కాదు. 2021 ఫిబ్రవరి 1 తర్వాత కొని, వార్షిక ప్రీమియం రూ.2.50 లక్షల కంటే తక్కువున్న యులిప్‌ల సరెండర్‌పై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(10డీ) ప్రకారం పన్ను మినహాయింపు కల్పించేవారు.
'ఐటీఆర్ సమర్పణ గడువు పెంపు'
అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) సమర్పణ గడువును ఈసారి బడ్జెట్‌లో పెంచారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు ఎంతో ఊరట, సౌలభ్యం లభించనున్నాయి. అప్‌డేటెడ్ ఐటీఆర్‌ల దాఖలుకు ఇంతకుముందు రెండేళ్ల గడువే ఉండేది. ఇప్పుడు దీన్ని నాలుగేళ్లకు పెంచారు. వీటికి సంబంధించిన ఐటీ రీఫండ్‌లకు క్లెయిమ్‌లు దాఖలు చేసే అంశంపైనా పలు పరిమితులు విధించారు. ఇలాంటప్పుడు చెల్లించాల్సిన ఆదాయపు పన్నులో దాదాపు 60 శాతం నుంచి 70 శాతంతో పాటు అదనపు ఆదాయంపై వడ్డీని కలిపి కట్టాల్సి ఉంటుందనే నిబంధనను విధించారు. అయితే మదింపు సంవత్సరం (అసెస్‌మెంట్ ఈయర్)లో అప్‌డేటెడ్ ఐటీఆర్‌ను ఎప్పుడు సమర్పిస్తున్నారనే అంశం ఆధారంగా పన్నులు నిర్ణయం అవుతాయి.
ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీం
సాధారణ 'నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీం' ద్వారా ఎంతైతే పన్ను మినహాయింపులను పొందుతామో- అంతే మినహాయింపులను ఇకపై 'నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య స్కీం' ద్వారా పొందొచ్చు. ఈ స్కీంను ప్రత్యేకించి బాలలు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు, దివ్యాంగుల కోసం రూపొందించారు. ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీంను వాడుకుని పాత పన్ను విధానం ద్వారా పేరెంట్స్, గార్డియన్లు అదనపు పన్ను మినహాయింపులను పొందొచ్చు. దాదాపు రూ.50వేల దాకా పన్ను మినహాయింపు లభిస్తుంది.
టీడీఎస్ పరిమితుల్లో మార్పులు
మూలం వద్ద పన్ను కోత(TDS), మూలం వద్ద పన్ను వసూళ్ల(TCS)కు సంబంధించిన పలు పరిమితులను ఈసారి కేంద్ర బడ్జెట్‌లో మార్చారు. వాటిలో సవరణలు చేశారు. సీనియర్ సిటిజెన్లు సంపాదించే వడ్డీ ఆదాయంపై పన్ను విధించే పరిమితిని రూ.1 లక్షకు పెంచారు. ఇతర వయస్కుల విషయంలో ఈ పరిమితిని రూ.50వేలకు పెంచారు. అద్దెలపై విధించే టీడీఎస్ పరిమితిని ఏటా రూ.6 లక్షలకు పెంచారు. డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.10వేలకు పెంచారు. దీనివల్ల టీడీఎస్ పరిధిలోకి వచ్చే ఇన్వెస్టర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194కే ప్రకారం డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్‌ను విధిస్తుంటారు.
విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి గుడ్ న్యూస్
మన దేశానికి చెందిన ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. వారు మన దేశానికి పంపే డబ్బులను 'రెమిటెన్స్' అంటారు. రెమిటెన్స్ నిధులపై మూలం వద్ద పన్ను(టీసీఎస్)ను వసూలు చేస్తుంటారు. దీని పరిమితిని ప్రస్తుతమున్న రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
జాతీయ పొదుపు పథకం
2024 ఆగస్టు 29వ తేదీన, ఆ తర్వాత జాతీయ పొదుపు పథకం(నేషనల్ సేవింగ్స్ స్కీం)లో చేరిన వారు డబ్బులను విత్‌డ్రా చేసుకుంటే పన్ను మినహాయింపును కల్పించనున్నారు. ఈ స్కీంకు సంబంధించిన సెంట్రల్ కేవైసీ వ్యవస్థలో పలు మార్పులు చేశారు. ఈ మార్పులు ఈ ఏడాది నుంచే విడతలవారీగా అమల్లోకి వస్తాయి. వీటివల్ల వినియోగదారుల వివాదాలు, సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది.