Eluru District Police Recover 638 Stolen Cell Phones : ఏలూరు జిల్లాలో చోరీకి గురైన ఖరీదైన సెల్‌ఫోన్‌లను పోలీసులు పెద్ద ఎత్తున రికవరీ చేశారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ఉపయోగించి 638 ఫోన్లను తిరిగి రాబట్టారు. వీటి విలువ రూ. 76,56,000 ఉంటుందని వెల్లడించారు. 3 నెలల కిందట నుంచి చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను అసలైన వినియోగదారులకు తిరిగి అందజేశారు.
టోల్ ఫ్రీ నెంబర్ : ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలో దొంగిలించిన, పోగొట్టుకున్న ఎంతో ఖరీదైన సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామన్నారు. సీసీఎస్ పోలీసులు, సైబర్ క్రైం, సివిల్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా గత మూడు నెలలో దొంగిలించిన, పోగొట్టుకున్న సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటిని జిల్లా టోల్ ఫ్రీ నెంబర్, సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్‌ని ఉపయోగించి రికవరీ చేసినట్లు తెలిపారు.
2,398 సెల్‌ఫోన్లు రికవరీ : ఈ మొబైల్ ఫోన్లను ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, విశాఖపట్నం, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు తెలంగాణ, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రదేశాలలో ప్రస్తుత యూజర్స్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా జిల్లాలో ఇప్పటివరకు 14 దఫాలుగా దొంగిలించిన, పోగొట్టుకున్న రూ.4.06 కోట్లు విలువచేసే 2,398 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశామన్నారు. సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారికోసం టోల్‌ఫ్రీ నం.95503 51100 ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
3 ఏళ్లు జైలు శిక్ష : దొంగిలించిన వస్తువులను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం శిక్షార్హమైన నేరమని వివరించారు. అలాంటి వారిపై సెక్షన్ 317 భారతీయ న్యాయ సంహిత 2023 ప్రకారం కేసు నమోదు చేస్తామన్నారు. దీంతో 3 సంవత్సరాలు వరకు జైలు శిక్ష పడుతుందన్నారు. 'మీ వస్తువులను కాపాడుకోండి, అప్రమత్తంగా ఉండండి, వ్యక్తులను బ్లాక్ మెయిల్ చేసేందుకు అనుచిత వీడియో కాల్స్ వంటి ఎత్తుగడలతో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి' అని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రజలకు సూచించారు. అనంతరం సెల్‌ఫోన్‌లను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అక్కడ ₹8 వేలకే ఐఫోన్ ! - భారీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులు - stolen Cell phones
రూ.3 కోట్ల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు - షాపు యాజమానులకు హెచ్చరికలు