Actor Prithviraj Complaint to Police on YSRCP Harassment: రెండు రోజులుగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని నటుడు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్‌కాల్స్, మెస్సేజ్‌లతో తనను ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ తన ఫోన్ నెంబర్ సోషల్ మీడియా గ్రూప్‌లో ఉంచి 1800 కాల్స్ చేయించారని వాపోయారు. తన అమ్మ, భార్య, పిల్లలను తిట్టించారని తెలిపారు.
వారి వేధింపులు తాళలేక ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. అనిల్ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. త్వరలో ఏపీ హోంమంత్రి అనితను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనను వేధించిన వారిపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తానని పృథ్వీరాజ్ తెలిపారు.
ఇదీ జరిగింది: ఇటీవల జరిగిన 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆ సినిమా వేడుకలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ విశేషాలు చెబుతూ 150 మేకల్లో చివరకు 11 మిగిలాయని పృథ్వీ చెప్పడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. దీంతో ఆ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ వైఎస్సార్సీపీ వింగ్ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. విశ్వక్‌సేన్ హీరోగా దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన చిత్రమే లైలా. ఆకాంక్ష శర్మ హీరోయిన్. అందులో పృథ్వీరాజ్ ఓ పాత్ర పోషించారు. సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేఫథ్యంలో ఈ చిత్రం వార్తల్లోకి ఎక్కడం పట్ల చిత్రయూనిట్ విచారం వ్యక్తం చేస్తున్నారు.