Patalkot Photos : 'ఈ ఊరు ఏంటి చాలా విచిత్రంగా ఉంది- మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోతుంది?' అంటాడు 'క' సినిమాలో హీరో. అలాంటి విచిత్రమైన ఊర్లో ఎవరికీ తెలియని రహస్యాన్ని ఛేదింస్తాడు. అయితే సినిమాలో ఇదంతా కల్పితం. కానీ నిజంగా ఇలాంటి ప్రాంతం ఉందంటే నమ్మగలరా? అవును మీరు చదివింది నిజమే మన దేశంలోనే ఇలాంటి విచిత్రమైన ప్రాంతం ఉంది.
విచిత్రమేంటంటే- అక్కడ ఉదయం 11 గంటల వరకు సూర్యుడి జాడ కనపడదు. ఇక మధ్యాహ్నం 3 గంటలకే ఆ ప్రాంతాన్ని దట్టమైన చీకటి అలుముకుంటుంది. అక్కడి ప్రజలకు బాహ్యప్రపంచంతో సంబంధం ఉండదు. ఆ ప్రాంతానికి వారే యజమానులు. ప్రభుత్వానికి కూడా దానిపై హక్కు లేదు. కానీ ఆ ప్రాంతం సౌందర్యానికి ఎవ్వరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? ఆక్కడే ఇలా ఎందుకు జరుగుతోంది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య కిరణాలు చేరుకోలేవు!
ఆ విచిత్రమైన ప్రాంతమే మధ్యప్రదేశ్ చింధ్వాడా జిల్లాలో ఉన్న పాతాళ్కోట్. పాతాళ్కోట్లో జడ్మదల్, హర్రా కచర్, సెహ్రా పచ్గోల్, సుఖ బండార్మౌ వంటి మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల చుట్టూ దాదాపు 3000 అడుగుల ఎత్తున దట్టమైన పర్వతాలు ఉన్నాయి. అందువల్ల గ్రామాలపైకి సూర్య కిరణాలు చేరుకోలేవు. దీంతో రోజులో దాదాపు 5 గంటలు మాత్రమే సూర్యకాంతి ఉంటుంది. మిగతా సమయం అంతా చీకటిగానే ఉంటుంది.
కరోనా జాడ లేదు
కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయింది. దాదాపు దేశాలన్నీ ఎక్కడికక్కడ లాక్డౌన్లు విధించాయి. కానీ ఆ సమయంలో పాతాళ్కోట్ ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కరోనా జాడ లేదు. ఇక్కడి ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. కాబట్టి ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు.
ప్రజల జీవనాధారమిదే!
పాతాళ్కోట్లో నివసించే గిరిజనుల జీవనానికి అడివే ఏకైక ఆధారం. అడవి నుంచి లభించే ఉత్పత్తులు, తేనె, తృణ ధాన్యాలు వారికి ప్రధాన ఆధారం. ఇప్పుడు ఒకటి రెండు గ్రామాల్లో కోడో కుట్కి (కోడో మిల్లెట్, లిటిల్ మిల్లెట్) వంటి రెండు మూడు రకాల పంటలు సాగు చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ లభించే మూలికలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
టూరిస్ట్ డెస్టినేషన్- ప్రభుత్వ సంకల్పం
పాతాళ్కోట్లో విలువైన మూలికలు ఉండటం వల్ల ప్రభుత్వం దీన్ని జీవవైవిధ్య ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. శివరాజ్ సింగ్ సీఎంగా ఉన్న సమయంలో స్థానిక భరియా తెగలను- నివాస హక్కుల కింద పాతాళ్కోట్ ప్రాంతానికి యజమానిగా ప్రకటించింది. ఇప్పుడు అక్కడి ప్రజల అనుమతి లేకుండా నీరు, ఆడవి, భూమిపై ఎవరూ హక్కులు పొందలేరు. కాగా, అక్కడ పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 2 వరకు పాతాళ్కోట్ సమీపంలో అడ్వెంచర్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. హాట్ ఎయిర్ బెలూన్, పారా గ్లైడింగ్తో పాటు అనేక ఉత్తేజకరమైన అడ్వెంచర్లు జరగనున్నాయి. ప్రపంచం మొత్తం పాతాళ్కోట్ అందాలను చూసేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ శీలేంద్ర శర్మ తెలిపారు.