Government Focus on LRS Petitions : వైఎస్సార్సీపీ హయాంలో నష్టపోయిన ప్రజలందరి ఇబ్బందులు తీరుస్తూ వస్తున్న కూటమి సర్కార్ ఇప్పుడు ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. 2020లో లేఅవుట్ క్రమబద్ధీకరణతో పథకాన్ని ప్రారంభించిన వైఎస్సార్సీపీ రూ.470 కోట్లు ఫీజులు వసూలు చేసింది. ఆ డబ్బుని పక్కదారి పట్టించి ప్రజలకు అవస్థలు మిగిల్చింది. దీంతో LRSలో ఉన్న 14 వేల పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ప్లాట్లు క్రమబద్ధీకరించకుండా ప్రజలను అప్పులపాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజల వెతలు తీర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణాభివృద్ధి సంస్థల్లో అపరిష్కృతంగా నిలిచిపోయిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై మరోసారి తాఖీదులు ఇవ్వనున్నారు. వీటి పరిష్కారానికి దరఖాస్తుదారుల నుంచి రావాల్సిన అదనపు సమాచారం, దస్త్రాలు, చెల్లించాల్సిన ఫీజులపై నోటీసులు సిద్ధం చేస్తున్నారు.
LRS: ఎల్‌ఆర్‌ఎస్ లేఅవుట్ల పరిశీలనకు ప్రభుత్వం మార్గదర్శకాలు
దరఖాస్తుదారులకు పోస్టులో నోటీసులు : గతంలోనూ ఇలాగే తాఖీదులిచ్చినా స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. లైసెన్స్‌డ్ సర్వేయర్ల ద్వారా ప్రజలు మొదట ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు చేశారు. నోటీసులు వారికే వెళ్లినా చాలామంది సరిగా స్పందించలేదు. దరఖాస్తుదారులతో సర్వేయర్లు మాట్లాడి పట్టణాభివృద్ధి సంస్థలు అడిగిన అదనపు సమాచారం పంపాలి. అలాంటి ప్రయత్నం లోపించడంతో పెండింగ్ దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో చిరునామా అందుబాటులో ఉన్న దరఖాస్తుదారులకు పోస్టులో నోటీసులు పంపనున్నారు. మిగతా వారి ఫోన్లకు సమాచారం అందివ్వనున్నారు. అడిగిన అదనపు సమాచారం, దస్త్రాలు పంపిన వారందరి పెండింగ్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని పట్టణాభివృద్ధి సంస్థలను ప్రభుత్వం ఆదేశించింది.
గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఫీజుల కింద వచ్చే కోట్ల రూపాయల ఆదాయంపైనే శ్రద్ధపెట్టింది. రూ.470 కోట్లకుపైగా వచ్చిన ఫీజులను ఇతర అవసరాలకు వాడేసుకుంది. పట్టణాభివృద్ధి సంస్థల్లో దీని కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించి వాటిలోనే ఫీజుల మొత్తాన్ని జమచేయాలన్న నిర్ణయానికి తూట్లు పొడిచింది. నిధులు మళ్లించడంతో క్రమబద్ధీకరణ ఫీజులతో పట్టణాల్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్న ఉద్దేశం కూడా ఆచరణలో నీరుగారిపోయింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో అప్పట్లో క్రమబద్ధీకరణ ఫీజుల కింద పట్టణాభివృద్ధి సంస్థలకు అత్యధిక ఆదాయం వచ్చింది. దీనిలో నుంచి రూపాయి కూడా మిగల్చకుండా గత ప్రభుత్వం లాగేసుకుంది.
ఎల్ఆర్ఎస్పై సుప్రీంలో విచారణ... నోటీసులు జారీ
ఎల్‌ఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన గత ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై గత ఐదేళ్లలో చేసిన సమీక్షలు నామమాత్రంగానే ఉన్నాయి. ఫీజుల వసూళ్ల కోసం ప్రజలకు వరుసగా నోటీసులివ్వడం తప్పితే అసలు మంత్రిస్థాయిలో సమీక్షలూ చేయలేదు. పరిష్కరించామని చెబుతున్న 30 వేల దరఖాస్తుల విషయంలోనూ పునఃపరిశీలన చేయాల్సి ఉంది. పట్టణాభివృద్ధి సంస్థల రికార్డుల్లో పరిష్కరించామని చూపిస్తున్న చాలా దరఖాస్తులు వాస్తవంగా పెండింగ్‌లో ఉన్నాయి. బాధితుల ఆవేదన అధికారులకు పట్టడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌లో పరిష్కరించామని చెబుతున్న దరఖాస్తులపై వినతుల స్వీకరణకు, పెండింగ్‌లో ఉన్నవాటి పరిష్కారానికి పట్టణాభివృద్ధి సంస్థల వారీగా మేళాలు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.